ఎగిరెగిరి పడిన మంత్రి సీదిరి అప్పలరాజుని కేబినెట్ నుంచి జగన్ రెడ్డి తప్పించేస్తున్నారని తాడేపల్లి వర్గాల భోగట్టా. చాలా రోజులుగా కొందరు మంత్రుల్ని సీఎం జగన్ మోహన్ రెడ్డి తొలగిస్తారనే వార్తలు వస్తున్నాయి. గత నెలలో గవర్నర్ భేటీ సందర్భంగా కూడా మంత్రివర్గ మార్పులు చేర్పులపై ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే అనూహ్యంగా ఇవి వాయిదాపడ్డాయి. మళ్లీ మంత్రి సీదిరి అప్పలరాజుని సీఎం హఠాత్తుగా పిలిపించి మరీ క్లాస్ పీకడంతో మంత్రి పదవి పీకేయడం ఖాయమని వార్తలు వస్తున్నాయి. ఇటీవల సస్పెండయిన నలుగురు ఎమ్మెల్యేలను సీఎం జగన్ రెడ్డి పిలిపించి మాట్లాడే వారిని సస్పెండ్ చేయడం, సీదిరి అప్పలరాజుని ప్రత్యేకంగా పిలిచి మరీ తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో తలంటడంతో మంత్రి పదవి ఊడిపోవడం ఖాయమని వైసీపీలోనే చర్చ సాగుతోంది. విషయం తెలిసినట్టుంది. జగన్ రెడ్డి కోసం ఏ త్యాగానికైనా సిద్ధమంటూ బిల్డప్ కబుర్లు చెబుతున్నారు సీదిరి. పలాస నియోజకవర్గంలో వివిధ కార్యక్రమాలలో బిజీగా ఉన్న సీదిరిని ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు ఉన్నఫళంగా రావాలని కోరడంతో, అన్నీ రద్దు చేసుకుని వచ్చేశారు. సీఎంతో భేటీ అయ్యాక మీడియాతో కూడా మంత్రి అప్పలరాజు మాట్లాడకపోవడంతో కేబినెట్ నుంచి తప్పించడం గ్యారెంటీ అని వైసీపీలోనే సీదిరి ప్రత్యర్థులు పండగ చేసుకుంటున్నారు. పలాస నుంచి తొలిసారిగా గెలిచిన డాక్టర్ సీదిరి అప్పలరాజుకి రెండో విడతలో జగన్ రెడ్డి ఏరికోరి మంత్రివర్గంలోకి తీసుకున్నారు. టిడిపిపై విమర్శలు చేయడం తప్పించి, వైసీపీ బలోపేతానికి చేసిన కృషి శూన్యమని వైసీపీ అధిష్టానం అసంతృప్తితో ఉంది. మరోవైపు భూకబ్జాలు, దందాల్లో నిత్యమూ మంత్రి పేరు వినిపిస్తోంది. వైసీపీలోనూ మంత్రి సీదిరి అంటే పడని వారంతా ఒక వైపుగా రాజకీయాలు ఆరంభించారు. ఇంటా-బయటా పోరు, అవినీతి ఆరోపణలన్నీ సీరియస్గా తీసుకున్న జగన్ రెడ్డి మంత్రి పదవి పీకేయడానికే మొగ్గుచూపుతున్నారని తెలుస్తోంది.
మంత్రి సీదిరికి ఊహించని దెబ్బ కొట్టిన జగన్ ?
Advertisements