విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం(దుర్గగుడి) రథంలో మూడు వెండి సింహాలు ఈ ఏడాది మార్చి తర్వాతనే మాయమైనట్లు పోలీసులు గుర్తించారు. గత మార్చిలో లాక్ డౌన్ విధించిన సమయంలో వీటిని చోరీ చేసి ఉండొచ్చని పోలీసు ఉన్నతాధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. క-రో-నా కట్టడి చర్యల్లో భాగంగా మార్చి ఆఖరి వారంలో ఉగాది ఉత్సవాలను దృష్టిలో ఉంచుకొని రథం తదితర వస్తువులకు పాలిష్ పెట్టే కాంట్రాక్టరు వీటిని పరిశీలించినట్లు పోలీసు విచారణలో రూఢీ అయ్యింది. దుర్గగుడి అధికారుల ఫిర్యాదు మేరకు రథంలోని మూడు వెండి సింహాల మాయంపై కేసు నమోదు చేసిన పోలీసులు గురువారం నుంచి దర్యాప్తను ముమ్మరం చేశారు. విజయవాడ పోలీసు కమిషనర్ బత్తిన శ్రీనివాసులు ఆదేశాల మేరకు మూడు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి విచారిస్తున్నారు. కేసు దర్యాప్తులో భాగంగా శుక్రవారం నేరపరిశోధన విభాగం (క్రైం) డీసీసీ కోటేశ్వరరావు మూడు సింహాలు మాయమైన రథాన్ని పరిశీలించారు. ఈ క్రమంలోనే కేసుకు సంబంధించిన కీలక సమాచారం పోలీసులకు చేరింది. వెండి, బంగారు, ఇత్తడి తదితర వస్తువులకు పాలిష్ పెట్టేందుకు శ్రీ శర్వాని ఇండస్ట్రీస్ సంస్థకు నెలకు రూ.47 వేలకు కాంట్రాక్టు ఇచ్చారు. వీరి నుంచి వెంకట్ అనే వ్యక్తి సబ్ కాంట్రాక్టు తీసుకొని పాలిష్ పనులు చేపడుతున్నారు.

ఉగాది ఉత్సవాల్లో వెండి రథంఅవసరాన్ని దృష్టిలో ఉంచుకొని పక్షం రోజుల ముందు రథం పరిశీలించిన వెంకట్ పాలిష్ వ్యవహారంపై ఆలయం గోల్డ్ అప్రెజర్ డీ. షమ్మీకి ఫోన్ చేసి చర్చించారు. పోలీసుల విచారణ సందర్భంగా షమ్మీ ఇదే విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకొచ్చినట్లు తెలిసింది. అయితే సబ్ కాంట్రాక్టర్ వెంకటను విచారించేందుకు పోలీసు అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అందుబాటులో లేకపోవడంతో పాటు మొబైల్ ఫోన్ స్విచ్చాఫ్ చేసి ఉండటంతో అతను వస్తే కీలక సమాచారం తెలిసే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా క-రో-నా కట్టడి చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించడంతో ఆలయాల్లోకి భక్తులను అనుమతించ లేదు. కేవలం అధికారులు, ఆలయ సిబ్బంది సమక్షంలోనే ఆలయాల్లో నిత్య కైంకర్యాలు నిర్వహించారు. జూన్ 10వ తేదీ నుంచి మాత్రమే భక్తులకు అనుమతించినందున ఆ మధ్యలోనే వెండి సింహాలు చోరీకి గురై ఉండొచ్చని పోలీసులు ఓ నిశ్చితాభిప్రాయానికి వచ్చారు. ఇందులో భాగంగా దర్యాప్తు వేగాన్ని పెంచిన పోలీసులు తొందరలోనే నిందితులను గుర్తించి పట్టుకుంటామని చెపుతున్నారు. గత కొద్ది రోజులుగా గత ప్రభుత్వ హయాంలో కూడా చోరీకి గురై ఉండే అవకాశం ఉందని ప్రకటనలు చేసిన అధికార పార్టీ నేతలు మార్చి తర్వాతనే ఘటన చోటు చేసుకున్నట్లు నిర్ధారణ కావడంతో మిన్నుకుండిపోయారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read