నిరుపేద గిరిజనుడి కిడ్నీ కుంభకోణానికి సంబంధించి నెల్లూరు జిల్లాలోని సింహపురి ఆస్పత్రి యాజమాన్యంపై వెంటనే తగు చర్య తీసుకోకుండా ఉండటం వెనుక, పెద్ద స్కెచ్ ఉన్నట్టు తెలుస్తుంది. జిల్లా కలెక్టర్ రాజకీయ వత్తిడులకు లొంగకుండా నిజాయతీగా 420, 384 సెక్షన్ల క్రింద కేసులు నమోదు చేశారు. తాజాగా, ఎస్సి.,ఎస్టి అట్రాసిటీ కేసు నమోదైంది.అయితే ఆ ఆసుపత్రి యజమాని, జగన్ పార్టీలో, నెంబర్ 2 గా ఉన్న సోదరుడికి కాబోయే వియ్యంకుడు అని, అందుకే చీఫ్ సెక్రటరీ స్థాయిలో ఒత్తిడి చేసి, కేసు ముందుకు కదలకుండా చేసినట్టు సమాచారం. జిల్లా కలెక్టర్, వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు పట్టుబట్టడం, స్థానిక మీడియా వరుసగా కధనాలు ప్రచురిస్తూ ఉండడంతో ప్రస్తుతానికి కేసులు నమోదైనా, జగన్ పార్టీలో ఉన్న నెంబర్ 2, సోదరుడి ఇంట్లో జూన్ 6న వివాహం జరిగే వరకు ఎటువంటి చర్య ఉండబోదని పై స్థాయి అధికారులు భరోసా ఇచ్చిన్నట్లు తెలుస్తుంది.
బ్రెయిన్‌డెడ్ అయిన ఏకొల్లు శ్రీనివాసులు అనే వ్యక్తి కుటుంబ సభ్యులను బలవంతంగా ఒప్పించి అవయవాలు కాజేశారన్న ఆరోపణలు జరువుకావడంతో వైద్యశాల యాజమాన్యంతో పాటు ముగ్గురు వైద్యులపై కూడా నెల్లూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. కాగా ఆ కేసుకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్‌ను కూడా జతచేశారు. దీనిపై సమీక్షించేందుకు రాష్ట్ర అట్రాసిటీ కమిషన్ నెల్లూరుకు రానుంది. ఈ లోపు నిందితులను అదుపులోకి తీసుకోవాలా లేదా అని పోలీసు ఉన్నతాధికారుల సమాలోచనలు చేస్తున్నారు. దీంతో పాటు కేసులో బాధ్యులుగా పేర్కొన్న ఐదుగురి వైద్యులపై చర్యలు తీసుకునేందుకు అధికారులు ఉపక్రమిస్తున్నారు. ఈ ఐదుగురి వైద్యుల లైసెన్సులు రద్దు చేయాలని ఇప్పటికే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు నివేదిక పంపగా కౌన్సిల్ వారికి నోటీసులు పంపినట్లు తెలిసింది.
అందులో భాగంగానే ఎంసీఐ ఈనెల 13వ తేదీన తమ ఎదుట హాజరు కావాలని తాఖీదులో పేర్కొన్నట్లు సమాచారం. ఎంసీఐ ఇచ్చిన నోటీసుపై స్టే కోసం వారు హైకోర్టును ఆశ్రయించిన నేపధ్యంలో ఈ పరిస్థితుల్లో స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. వీరితో పాటు అరెస్టులు జరక్కుండా వైద్యశాల యాజమాన్యం ముందు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తున్నది. అయితే ఇదే సయంలో పలు గిరిజన సంఘాలు మానవ హక్కుల కమిషన్‌ను కలసి పరిస్థితి వివరించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ విషయమై పలు ప్రజా సంఘాలు ఓ అభిప్రాయానికి వచ్చేందుకు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. సంఘటన జరిగి ఎన్నిరోజులైనా బాధ్యులను ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.