గన్నవరం విమానాశ్రయానికి పూర్తిస్థాయిలో అంతర్జాతీయస్థాయి నేటి నుంచి రానుంది. 2017 మే నెలలో గన్నవరం విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదాను కల్పిస్తున్నట్టు కేంద్ర పౌరవిమానయాన శాఖ ప్రకటించింది. ఆరు నెలల్లో అంతర్జాతీయ విమాన సర్వీసులు గన్నవరం నుంచి బయలుదేరతాయన్నారు. కానీ.. అప్పటినుంచి అనేక ఒడుదుడుకులను ఎదుర్కొని.. ఏడాదిన్నర తర్వాత ఈరోజు కల సాకారం కాబోతోంది. ఏడాది కిందటే అంతర్జాతీయ సేవలు అందించేందుకు అవసరమైనమౌలికసౌకర్యాలు విమానాశ్రయంలో సిద్ధమైనా.. ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ విభాగాలకు సంబంధించిన అనుమతులు, విమానయాన సంస్థలు ముందుకు రాకపోవడం వంటి సమస్యలు ఎదురయ్యాయి. చివరికి.. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకోవడంతో.. ఇండిగో విమానయాన సంస్థ ముందుకొచ్చింది.
దీంతో గన్నవరం విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు నేడు ప్రారంభం కానున్నాయి. సింగపూర్ విమాన సర్వీసును వెంకయ్యనాయుడు లాంఛనంగా ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి పౌర విమానయాన శాఖ మంత్రి సురేష్ ప్రభు, సహాయ మంత్రి జయంత్ సిన్హాతోపాటు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరుకావాల్సి ఉంది. అయితే కేంద్రంలోని ఎన్‌డీఏతో తెగతెంపులు చేసుకున్న తరువాత చంద్రబాబు రాష్ట్రంలో కేంద్ర మంత్రుల పర్యటనలకు దూరంగానే ఉంటున్నారు. ఈ కార్యక్రమానికి కూడా హాజరు వస్తారనే సమాచారం ఉన్నా, చంద్రబాబు వస్తారో రారో చూడాల్సి ఉంది. ఇక సింగపూర్ విమాన సర్వీసును ప్రారంభించే వెంకయ్య నాయుడు, అంతర్జాతీయ సమగ్ర టెర్మినల్ భవన నిర్మాణానికి కూడా భూమిపూజ చేస్తారు.
ప్రస్తుతం మంగళ, గురువారాల్లో రెండు రోజులు సింగపూర్‌కు సర్వీసులు నడుస్తాయి. రద్దీని బట్టి వీటిని పెంచనున్నారు. 180 సీటింగ్ ఉన్న ఏ320 ఎయిర్‌బస్‌లను సింగపూర్‌కు ఇండిగో నడుపుతోంది. టిక్కెట్ ధర రూ.7,500 నుంచి రూ.10,422గా నిర్ణయించారు. సింగపూర్ నుంచి కూడా మంగళ, గురువారాల్లోనే విజయవాడకు సర్వీసులు నడుస్తాయి. సింగపూర్‌లో ఉదయం 11.40కు బయలుదేరే విమానం మధ్యాహ్నం 3.45కు గన్నవరం చేరుతుంది. గన్నవరం నుంచి నేడు బయలుదేరి వెళ్లనున్న తొలి సర్వీసుకు 99, సింగపూర్ నుంచి ఇక్కడికి వచ్చే సర్వీసుకు 150 టిక్కెట్లు బుక్కయ్యాయి.