ఒక పక్క అమరావతికి నిధులు ఇవ్వకుండా, మీకు మయసభ కావాలా, మీకు ఇంత పెద్ద రాజధాని అవసరమా అంటూ బీజేపీ నేతలు హేళన చేస్తున్నారు. రెండు రోజుల క్రితం అమిత్ షా మాట్లాడుతూ, మీ అమరావతి ప్లాన్ లు ఇంకా సింగపూర్ లోనే ఉన్నాయి, వెళ్లి తెచ్చుకోండి అంటూ ఎగతాళి చేసి, రూపాయి కూడా అమరావతి మీద ఖర్చు పెట్టలేదు, 1500 కోట్లకు ఖర్చు ఇవ్వలేదు అని అబద్ధాలు ఆడుతూ, అడుగు అడుగునా అమరావతి పై విషం చిమ్ముతూ, హేళనగా మాట్లాడుతూ, ఎగతాళి చేస్తుంటే, అదే సింగపూర్ ప్రధాని, మన ప్రధాని మోడీ ముందు అమరావతి ప్రస్తావాన తీసుకు వచ్చారు. సింగపూర్ లోనే మీ అమరావతి ప్లాన్ లు ఉండి పోయాయి అని ఎగతాళి చేస్తున్న అమిత్ షా గారు, మీ ప్రాణ స్నేహితుడు మోడీ గారికి, ఆ సింగపూర్ ప్రధాని, మా అమరావతి గురించి ఏమి చెప్పారో చూడండి..
మన ప్రధాని నరేంద్ర మోడి గారు, సింగపూర్ లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా సింగపూర్ ప్రధాని లీ హసీన్ లూంగ్ ని కలిసారు. మోదీ సింగపూర్‌లోని ఇస్తానాలో సింగపూర్ ప్రధాని లీ హసీన్ లూంగ్‌తో కలిసి సంయుక్త విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా, అమరావతి గురించి సింగపూర్ ప్రధాని లీ హసీన్ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నగర ప్రాజెక్టు సింగపూర్ కన్సార్షియంతో విజయవంతంగా కొనసాగుతోందన్నారు. అమరావతిలో సింగపూర్ కన్సార్షియం ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దీని పై గ్రౌండ్ వర్క్ జరుగుతుంది. మరో నెల రోజుల్లో, ఇక్కడ పనులు మొదలు కానున్నాయి. ఇదే విషయం పై సింగపూర్ ప్రధాని, మన ప్రధాని మోడీ పక్కన ఉండగానే, అమరావతి నగర ప్రాజెక్టు సింగపూర్ కన్సార్షియంతో విజయవంతంగా కొనసాగుతోందన్నారు.
సింగపూర్, భారతదేశం త్వరలోనే ఎయిర్ సర్వీస్ అగ్రిమెంట్ కుదుర్చుకోబోతున్నట్లు మోదీ తెలిపారు. ప్రముఖ కంపెనీల సీఈఓల్లో చాలా మంది భారతదేశం వైపు నమ్మకంతో చూస్తున్నందుకు తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. భారతదేశంతో సంబంధాలను బలోపేతం చేసేందుకు లీ అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. భారతదేశంతోపాటు ఇతర దేశాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు సింగపూర్ కేంద్రంగా మారిందని అన్నారు ప్రధాని మోడీ. మోదీ అంతకుముందు సింగపూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మూడు భారతీయ మొబైల్ పేమెంట్ యాప్‌లను ఆవిష్కరించారు. లీతో సంయుక్త మీడియా సమావేశంలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ రూపే, భీమ్, యూపీఐ ఆధారిత చెల్లింపు యాప్‌లను అంతర్జాతీయంగా ఆవిష్కరించామని, ఇది డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని, సింగపూర్‌తో బలపడుతున్న భాగస్వామ్యాన్ని తెలియజేస్తోందని వివరించారు.