విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో, బొండా ఉమా గెలుపుకు ప్రధాన కారణం, ఈ ఎన్నికల హామీ... ఇచ్చిన మాట ప్రకారం, హామీ నెరవేర్చి, చిత్తశుద్ధి చాటుకున్నారు... విజయవాడలో ఉన్న చెత్త అంతా వెళ్ళేది, సింగ్‌నగర్ దగ్గర ఉన్న డంపింగ్ యార్డ్ లోకే... ఎన్నికల హామీలో, ఈ సమస్యకు పరిష్కారం చూపుతామని చెప్పారు... సింగ్‌నగర్ వాసుల దశాబ్దాల నిరీక్షణకు నిలువెత్తు సమాధానంగా, ఈ సమస్య ఇన్నాళ్ళకు పరిష్కారం అయ్యింది.. పంచాయతీ రాజ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ రీ మీడియేషన్ ఆఫ్ బయోమైనింగ్ ప్రాజెక్టుకు డిసెంబరులో శంకుస్థాపన చేసారు. రూ.14 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు, ఏడాదిలోపే, రెండున్నర లక్షల టన్నుల చెత్తను తొలగించే స్థాయికి చేరుకోవాలని ముఖ్యమంత్రి టార్గెట్ ఇచ్చారు...
జిగ్మా గ్లోబల్ ఎన్విరాన్‌మెంట్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ నేతృత్వంలో ఈ పనులు రెండు వారాల క్రితమే పూర్తి స్థాయిలో ప్రారంభమయ్యాయి. పనులను వేగవంతం చేసేందుకు ప్రసుత్త యంత్రాలను కొరియా నుంచి ప్రత్యేకంగా జిగ్మా సంస్థ తెప్పించుకుంది. ప్రస్తుతం పనిచేస్తున్న యంత్రాలతో రోజుకు వంద టన్నుల చెత్తను వేరు చేస్తున్న సిబ్బంది ప్లాస్టిక్, కంకర, మట్టి, లిక్విడ్ వేస్ట్‌ను వేరుచేస్తున్నారు. కొరియన్ సంస్థ నుంచి తెప్పించిన యంత్ర సామగ్రితో పనులను ప్రారంభించిన కాంట్రాక్టు సంస్థ రాబోయే 15 రోజుల్లో మరో నాలుగు యంత్రాలతో యార్డు నలు దిక్కుల నుంచి చెత్త వేరుచేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టబోతోంది. ఏకకాలంలో పనులను చేపట్టడం ద్వారా రోజుకు నాలుగు వందల టన్నుల చెత్తను వేరు చేయొచ్చని జిగ్మా సంస్థ ప్రతినిధులు వివరిస్తున్నారు.
డంపింగ్ యార్డులో పేరుకుపోయిన చెత్తను బయో, ప్లాస్టిక్, పారిశుధ్య వ్యర్థాలుగా వేరుచేస్తారు. వేరు చేసిన వ్యర్థాలను అవసరమైన మేరకు విక్రయించి మరికొన్నింటిని భూమిలో కలిపేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తారు.ప్లాస్టిక్, పారిశుధ్య వ్యర్థాలు ప్లాస్టిక్ వ్యర్థాలను వేరుచేసి ఉపయోగపడేవాటిని విక్రయానికి పంపుతారు. పారిశుధ్య వ్యర్థాలను ప్రత్యేక శాస్త్రీయ పద్ధతిలో భూమిలో పూడుస్తారు. యార్డులో గోతులు తీసి పారిశుధ్య వ్యర్థాలను లేయర్లుగా వేసి మట్టితో పూడ్చేస్తారు. ఇలా కొన్ని లేయర్లు వేసిన అనంతరం పూడ్చిన వ్యర్థాలను సుమారు 12 సంవత్సరాల వరకు కదిలించకుండా చర్యలు తీసుకుంటారు. మధ్యలో బయటకు తీయడం వల్ల ప్రమాదకర విషవాయువులు వెలువడే అవకాశం ఉంటుంది.