చంద్రబాబుని ఇరికిద్దామనుకుని చేసిన డేటా చోరీ వ్యవహారం పై ప్రముఖ సినీనటుడు శివాజీ విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ, డేటా దుర్వినియోగం అంటూ ఆరోపణలు చేస్తున్న పార్టీలన్నీ ఆ కోవకు చెందినవేనని ఆరోపించారు. కేసీఆర్, అమిత్ షా ల పై సంచలన ఆరోపణలు చేసారు. డేటా చోరీ జరిగిందని ఆరోపిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుగా తన ప్రశ్నకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో టీడీపీని ఓడించి జగన్‌ను సీఎం చేయాలనే లక్ష్యంగా కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నారని శివాజీ ఆరోపించారు. ఇక కేసీఆర్ అధికారంలోకి వచ్చాక తెలంగాణ వ్యాప్తంగా నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేను తన పార్టీకి అనుకూలంగా కేసీఆర్ వాడుకున్నారని ఆరోపించారు.
‘‘గ్రేటర్ పరిధిలో 40 లక్షలకు పైగా సెటిలర్లు ఉన్నారు. ఈసీని కలవడానికి ముందే సమగ్ర సర్వే చేశారు. సమగ్ర సర్వేలో ప్రతి ఒక్కరి వివరాలు తీసుకున్నారు. ఎస్‌ఆర్‌డీహెచ్ అప్లికేషన్ తెలంగాణ పోలీస్ శాఖ తయారు చేసింది. అప్లికేషన్ కోసం టెండర్లు కూడా పిలిచారు. ఈసీ, సీఎస్, గ్రేటర్ కమిషనర్ కలసి పైలెట్ ప్రాజెక్టు చేపట్టాలనుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం, ఈసీ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఓట్లను తొలగించడానికి ఓ ప్రణాళికను తయారు చేశారు. ఈసీ వద్ద నుంచి ఆధార్ డేటా, ఓటర్ లిస్టును తీసుకున్నారు. ప్రభుత్వం వద్ద ఉన్న సమగ్ర సర్వే వివరాలను ఈసీ దగ్గరున్న జాబితాతో పోల్చి ఓట్లను తొలగించారు. డేటా చోరీ జరిగిందని గుండెలు బాదుకుంటున్న తెలంగాణ ప్రభుత్వం మా ప్రశ్నకు సమాధానం చెప్పాలి. నిబంధనల ప్రకారమే వెళ్తున్నామంటూ రజత్‌కుమార్ వ్యూహాత్మకంగా కేసీఆర్‌కు సహకరించారు. మర్రి శశిధర్‌రెడ్డి ఫిర్యాదులో వివరాలన్నీ ఉన్నాయి. కేంద్రం నుంచి టీఆర్‌ఎస్‌కు పూర్తి సహాయ సహకారాలున్నాయి. ఓట్ల తొలగింపు స్మూత్‌గా సాగిపోయింది. అదే తరహాలో ఏపీపై కేసీఆర్ గురిపెట్టారు’’ అని ఆరోపణలు చేశారు.
ప్రభుత్వ పథకాలతో లబ్ధి పొందుతున్న వారి వివరాలు అడిగి తెలుసుకోవడం నేరమైతే అందరికంటే ముందు నేరస్థుడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షానే అని నటుడు శివాజీ విమర్శలు కురిపించారు. తనకు ఎవరిపైనా అక్కసు లేదని, ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు కూడా లేవని ఆయన అన్నారు. ఒక పౌరుడిగా తనాు నిజాలు మాట్లాడాలనుకుంటున్నట్లు శివాజీ చెప్పుకొచ్చారు. ఆగస్టు 28న మీటింగ్‌లో అమిత్ షా స్వయంగా సీఎంలను అడిగారని, తమ పథకాలతో లబ్ధి పొందుతున్న వారి వివరాలు తెలియజేయాల్సిందిగా అమిత్‌షా కోరారని శివాజీ వెల్లడించారు. లబ్ధిదారుల సమచారం దగ్గర పెట్టుకోవడం నేరం అయితే అందరి కంటే ముందు నేరం చేసిన వ్యక్తి అమిత్‌షానే అవుతారని ఆరోపించారు. 22 కోట్ల కుటుంబాల డేటా అమిత్‌షా దగ్గరుందని, అది డాటా చౌర్యం కాదా? అని శివాజీ ప్రశ్నించారు.