పోలవరం ప్రాజెక్టును ఆపేందుకు కుట్రలు జరుగుతున్నాయని సినీ నటుడు శివాజీ అన్నారు. ఒకవేళ కేసీఆర్ అనుకూల ప్రభుత్వం వస్తే పోలవరం ప్రాజెక్టు ఆగిపోతుందని ఆరోపించారు. అలాగే రాజధాని సైతం తరలిపోయే ప్రమాదముందని హెచ్చరించారు. ఈ మేరకు విజయవాడలో మీడియాతో మాట్లాడారు. ‘నిజం విత్ శివాజీ’ పేరిట రాజధాని, పోలవరం తదితర అంశాలపై కొన్ని వీడియోలను ప్రదర్శించారు. తన దృష్టికి వచ్చిన అంశాలను మాత్రమే మీ దృష్టికి తీసుకొస్తున్నానని చెప్పారు. తనపై కొందరు కులాజీ అని ముద్ర వేస్తున్నారని తెలిపారు. తాను ఈ ప్రాంతం కోసం పోరాడుతున్నానని అన్నారు. రాజకీయ పార్టీల తరఫున కాకుండా ప్రజల తరఫున ప్రశ్నించానని గుర్తు చేశారు. ప్రశ్నించే వాడికి కులం అంటగుడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
కేసీఆర్ పోలవరం ఆపేస్తారు.. పోలవరం ప్రాజెక్టు పరిశీలించిన సమయంలో తీసిన వీడియోను తొలుత శివాజీ ప్రదర్శించారు. 2021 అక్టోబర్ నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని తెలిపారు. కొందరు ఇంత పని జరుగుతుంటే అసలు గ్రాఫిక్స్ అని చెప్పడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో సరైన వ్యక్తి అధికారంలోకి రాకపోతే ఈ ప్రాజెక్టును తెలంగాణ సీఎం కేసీఆర్ ఆపేస్తారని ఆరోపించారు. వాళ్లు కోరుకున్న ప్రభుత్వం వస్తే తప్పక ఆపేస్తారని వివరించారు. ఈ సందర్భంగా ఎంపీ కవిత ఓ సందర్భంలో పోలవరం అడ్డుకుంటామంటూ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ప్రదర్శించారు. సరైన నాయకుడిని ఎన్నుకోకుంటే 70 శాతం పూర్తయిన ప్రాజెక్టును అడ్డుకునే ప్రమాదముందని, ప్రజలు సరైన నిర్ణయం తీసుకుని ఓటేయాలని విన్నవించారు. జగన్‌పై కేసీఆర్‌కు నిజంగా ప్రేమ ఉందని అనుకోనని, ఆయన ఆడుతున్న పన్నాగాల్లో చిక్కుకోవద్దని హితవు పలికారు. కేసీఆర్‌తో స్నేహమంటే పులిపై స్వారీ చేసినట్లేనని వ్యాఖ్యానించారు.
రాజధాని అభివృద్ధి కనిపించడం లేదా? అనంతరం అమరావతిలో పర్యటించినప్పటి వీడియోను శివాజీ ప్రదర్శించారు. అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను వీడియోలో చూపించారు. రాజధానిలో పర్మినెంట్ పేరుతో ఒక్కటంటే ఒక్క ఇటుక కూడా పడలేదన్న జగన్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను ఈ సందర్భంగా ప్రదర్శించారు. జగన్ ఇంటికే మూడున్నరేళ్లు పడితే ఇంతపెద్ద రాజధాని నిర్మాణానికి ఆ మాత్రం సమయం పట్టదా? అని ప్రశ్నించారు. గ్రాఫిక్స్ అని మాత్రం విమర్శలు చేయడం తగదని హితవు పలికారు. రాజధాని నిర్మాణంపై జరుగుతున్న దుష్ప్రచారం నమ్మొద్దని సూచించారు. రాజధానిని వేరే ప్రాంతానికి తరలించేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఎవరి సొమ్మని రాజధానిని తరలిస్తారని ప్రశ్నించారు. భూములు ఇచ్చిన రైతులు, ఇక్కడి రైతులు పిచ్చివాళ్లా?అని నిలదీశారు.