ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల సరళి పై నటుడు శివాజీ స్పందించారు. ఈ మేరకు ఒక వీడియోను విడుదల చేశారు. భాజపా నూతన డ్రామాకు తెరతీసిందని విమర్శించారు. తెరాసకు 16 ఎంపీ సీట్లు, జగన్‌కు 17 ఎంపీ సీట్లు వస్తాయని, తొలివిడత జరిగిన పోలింగ్‌లో ఎన్డీయేకు మరో 39 సీట్లు కలిపి మొత్తం 72 స్థానాలు తమ సొంతమవుతాయని భాజపా ప్రచారం చేసుకుంటోందని వివరించారు. ఈ నాటకాన్ని శుక్రవారం మరింత ఉద్ధృతం చేశారని, జగన్ బెస్ట్ సీఎం అంటూ ప్రశాంత్ కిషోర్ పొగడడం వంటి కొన్ని వీడియోలు విడుదల చేశారని విమర్శించారు. అయితే ఇవి కేవలం ఊహలు మాత్రమేనని శివాజీ కొట్టిపారేశారు. మే 23న అనూహ్య ఫలితాలు ఉండబోతున్నాయని శివాజీ ధీమా వ్యక్తం చేశారు.
భాజపా, వైకాపాల దుష్ప్రచారాన్ని ఎవరూ పట్టించుకోకుండా నిర్భయంగా ఉండాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. చంద్రబాబు వ్యూహాన్ని తెదేపా నేతలు అర్థం చేసుకోలేకపోయారని, నిశ్చింతగా ఉండాలని శ్రేణులకు సూచించారు. ‘పీఏఆర్సీ అనే పేపర్ ను తయారుచేసి, వాళ్లదో గవర్నమెంటు స్టాంపులాగా ఓ స్టాంపు వేసి ఇదే రాజముద్ర అన్నట్లు ఎన్డీయేకు 39, ఫెడరల్ ఫ్రంట్ కు 33 సీట్లు వస్తున్నాయని చూపించారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంటే కేసీఆర్ కు 16, జగన్ మోహన్ రెడ్డికి 17 సీట్లు.. మొత్తం కలిపి 33 సీట్లు వస్తాయని చెబుతున్నారని తెలిపారు. అయితే, ఇందుకు భిన్నంగా ఏపీలో ప్రజలు ఒకవైపే ఉన్నారనీ, మే 23న ప్రజాతీర్పుతో ప్రజాప్రభుత్వం ఏర్పడబోతోందని శివాజీ వ్యాఖ్యానించారు.
చంద్రబాబు ఓడిపోతున్నాడు కాబట్టే ఫ్రస్ట్రేషన్ తో ఉన్నారని చెప్పేందుకు వైసీపీ ఇంటర్నల్ వీడియోలను విడుదల చేసిందని ఆరోపించారు. చంద్రబాబు వ్యూహాన్ని టీడీపీ నేతలు అర్థం చేసుకోలేక భయపడుతున్నారన్నారు. ‘ఎవ్వరూ భయపడాల్సిన పని లేదు. 23న ప్రజా ప్రభుత్వం ఏర్పడబోతోంది. తీర్పు అనూహ్యంగా ఉండబోతోంది. బెట్టింగులు, అంచనాలు కేవలం టైంపాస్ కు మాత్రమే. ప్రజలంతా వన్ సైడ్ గా ఉన్నారు. ఎంజాయ్’ అంటూ వీడియోను ముగించారు.