టీవీ9 షేర్ల వ్యవహారంలో మాజీ సీఈఓ రవిప్రకాశ్ తో పాటు ప్రముఖంగా వినిపిస్తున్న మరో పేరు హీరో శివాజీ. తాజాగా వీరిద్దరిపై తెలంగాణ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీచేసినట్టు వార్తలొస్తున్నాయి. వీరిరువురిపై అలంద మీడియా ఫిర్యాదు చేసినప్పటినుంచి తెలుగు రాష్ట్రాల్లో ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశం అయింది. గత కొన్నిరోజులుగా రవిప్రకాశ్, శివాజీ ఆచూకీ తెలియకపోవడంతో వీరిద్దరూ ఫలానా ప్రాంతాల్లో తలదాచుకుని ఉండొచ్చంటూ ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో హీరో శివాజీ ఓ వీడియో ద్వారా తెరపైకి వచ్చారు. శివాజీ ఎక్కడికీ పారిపోలేదని, శివాజీ వెన్నుచూపే వ్యక్తికాదని ఆ వీడియోలో వివరించారు. "శివాజీ పారిపోయాడు" అని ప్రచారం చేసే మీడియాలోని ఓ వర్గం కోసం ఈ వీడియో రూపొందించలేదని, తన బాణీ వినపించడానికే రూపొందించానని తెలిపారు.
"ఇది రవిప్రకాశ్ కు నాకూ మధ్య ఉన్న విషయం. షేర్ల విషయంలో ఉన్న పంచాయితీ ఇది. ఈ సివిల్ పంచాయితీని కాస్తా క్రిమినల్ వ్యవహారంగా మార్చడానికి మధ్యలో ఈమెయిల్స్ తీసుకొచ్చారు. డిలీట్ చేసిన ఈమెయిల్స్ రికవర్ చేసినవాళ్లకు అందులో లేని పదాలను యాడ్ చేయడం పెద్ద విషయమేమీ కాదు. ఇదో కుట్ర. 2018 ఫిబ్రవరిలో నాకూ రవిప్రకాశ్ కు మధ్య అగ్రిమెంట్ జరిగింది. అదే ఒప్పందాన్ని ఇటీవలే తిరగరాసుకున్నాం. ఇది సాధారణమైన విషయమే. సంస్థలోకి కొత్త వ్యక్తులు వస్తున్నప్పుడు నా ప్రయోజనాలను కాపాడుకునేందుకు నేను ఆ మాత్రం జాగ్రత్తలు తీసుకోవడంలో తప్పులేదు. కానీ ఈ విషయంలో ఏదో జరిగిపోతోందని చెబుతూ కౌశిక్ రావు అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడం, వాళ్లు మా ఇంటి మీద పడిపోయి మావాళ్లందరినీ సోఫాల్లో కూర్చోబెట్టి ఇల్లంతా వెదికి ఏమీ దొరకలేదని సంతకం పెట్టించుకుని వెళ్లిపోవడం.. ఏమిటిదంతా!" అంటూ మండిపడ్డారు. తాము సెటిలర్లం కాబట్టి, తమకు స్థానబలం లేదని తమపై హైదరాబాదు పోలీసులు కేసులు పెట్టి లోపల వేసేస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అయినా తాను భయపడి పారిపోవడానికి ఇదేమైనా పెద్ద కేసా? అంటూ శివాజీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇలాంటి కేసులు 100 వేసుకున్నా ధైర్యంగా ఎదుర్కొంటానని, అయితే అనారోగ్యం కారణంగానే విశ్రాంతి తీసుకుంటున్నాను తప్ప ఎక్కడికీ పారిపోలేదని స్పష్టం చేశారు. ఈ కొన్నిరోజుల వ్యవధిలోనే తాను తిరుపతి వెళ్లానని, ఓ ఆస్తి రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నానని వెల్లడించారు. ఎలాంటి మ్యాటర్ లేని ఈ కేసులో ట్విట్టర్ వేదికగా, టీవీల వేదికగా శునకానందం పొందుతున్న సోదరులందరికీ చెప్పేదొక్కటే, ఇప్పుడు మీరు రాళ్లు వేస్తున్నారు. ఇక్కడ ఉన్నది ఓ కొండ. ఇలాంటి రాళ్లకు భయపడను. కానీ మీరు ఉన్న గాజు గదులు మీరు విసిరే రాయి దెబ్బకు పగిలిపోతాయి. ముందు ఆ విషయం చూసుకోండి. రాజ్యాంగం ఇచ్చిన హక్కులను అనుసరించి నేను ముందుకు వెళుతున్నాను. దేనికీ ఇబ్బంది పడను" అంటూ తనదైన శైలిలో శివాజీ వ్యాఖ్యానించారు. రేపు ఎన్నికల ఫలితాల తర్వాత ప్రజలు అనుకోని ప్రభుత్వం వచ్చినా పోరాడేందుకు తాను సిద్ధం అంటూ సమరోత్సాహం ప్రదర్శించారు.