ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఓ రాజ్యాంగబద్ధ సంస్ధ నుంచి నాలుగైదు రోజుల్లో నోటీసులు అందబోతున్నాయంటూ, నాలుగు రోజుల క్రిందట హీరో శివాజీ కొద్దిరోజుల క్రితం ప్రకటించి కలకలం రేపిన సంగతి తెలిసిందే. శివాజీ చెప్పిన దగ్గర నుంచి రాష్ట్రంలో చర్చ జరుగుతూనే ఉంది. శివాజీ చెప్పినట్టు గానే, 8 ఏళ్ళ క్రిందట కేసు తిరగదోడి, తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరుగుతున్న తరుణంలో చంద్రబాబుకు బాబ్లీ కేసులో మళ్లీ నోటీసులివ్వడం తెలుగు రాష్ట్రాల్లో చర్చకు దారితీస్తోంది. ఈ కేసు అటు మహారాష్ట్ర ఇటు తెలంగాణ, ఏపీకి ముడిపడి ఉంది.
నిజానికి అప్పట్లో చంద్రబాబుపై కేసులను మహారాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకుందని మీడియాలో వార్తలు కూడా వచ్చాయి. అయితే తెలంగాణలో ఎన్నికలు జరుగబోతున్న సమయంలో ఇప్పడు ఈ నోటీసుల అంశం తెరపైకి రావడం కొత్త చర్చకు దారితీసింది. అయితే, ఈ రోజు హీరో శివాజీ మరో సారి స్పందించారు. ఈ సారి, మరో పెద్ద బాంబు పేల్చారు. చంద్రబాబుకు మరో రెండుమూడు నోటీసులు రాబోతున్నట్లు చెప్పారు. చంద్రబాబు వారి ట్రాప్లో పడకుండా జాగ్రత్తగా ఉండాలని శివాజీ సూచించారు. అతి త్వరలోనే చంద్రబాబుకి ఆ రెండు నోటీసులు రాబోతున్నాయని కూడా చెప్పారు.
ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూలదోయడం సరికాదని వ్యాఖ్యానించారు. కుర్చీ కాంక్ష మొదలైనప్పుడే విధ్వంసం మొదలవుతుందని శివాజీ చెప్పారు. జనవరిలో ఎన్నికలు వస్తాయని జగన్ ఎలా చెప్పగలుగుతున్నారని ఆయన ప్రశ్నించారు. ఏదో విధంగా చంద్రబాబును ఒంటరి చేసి, ప్రభుత్వాన్ని కూలదోయాలని చూస్తున్నారని ఆరోపించారు. దేశంలో మోదీకి ఎదురుగా నిలబడ్డ వ్యక్తి చంద్రబాబు ఒక్కరేనని శివాజీ వ్యాఖ్యానించారు. ఐక్యరాజ్యసమితిలో మాట్లాడే అవకాశం చంద్రబాబుకు దక్కడం తెలుగుజాతికి గౌరవమని శివాజీ అభిప్రాయపడ్డారు.