ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన నేపథ్యంలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో నల్ల జెండాలు, ఫ్లెక్సీలతో నిరసన తెలుపుతున్నారు. ‘మోదీ గో బ్యాక్’ నినాదాలతో హోరెత్తిస్తున్నారు. గుంటూరులో జిన్నాటవర్ సెంటర్ వద్ద తెదేపా కార్యకర్తలు నిరసనలు తెలిపారు. విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద తెలుగు యువత ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమం చేపట్టారు. నల్లబెలూన్లు ఎగరవేశారు. విశాఖలో సైతం మోదీ రాకపై నిరసనలు వ్యక్తమయ్యాయి. మరో వైపు మోదీ రాకను నిరసిస్తూ విజయవాడ దుర్గా ఘాట్ వద్ద సినీ నటుడు శివాజీ జలదీక్షకు దిగారు. మోదీ పర్యటన ముగిసే వరకు ఆయన దీక్ష చేపట్టనున్నారు.
ఆయనకు సంఘీభావంగా కృష్ణా నదిలో పలువురు యువకులు దీక్షకు దిగారు. వీరికి ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ కారెం శివాజీ సంఘీభావం తెలిపారు. మోదీ రాకను గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ బ్లాక్ డేగా అభివర్ణించారు. పార్లమెంటులో ఏపీ గురించి అడిగితే మోదీ పట్టించుకోలేదని మండిపడ్డారు. రాష్ట్రానికి ఏం చేయాలని మోదీ వస్తున్నారని ప్రశ్నించారు. ప్రొటోకాల్ ప్రకారం తాను మోదీ పర్యటనకు వెళ్లాల్సి ఉన్నా.. వెళ్లట్లేదని స్పష్టంచేశారు. ఆంధ్రప్రదేశ్‌కు నమ్మకద్రోహం చేసి ఇప్పుడు తీరిగ్గా రాష్ట్రానికి ఎలా వస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీపై ముఖ్యమంత్రి చంద్రబాబు విరుచుకుపడ్డారు. ‘ఆంధ్రప్రదేశ్ ప్రజల న్యాయమైన, చట్టపరమైన హక్కుల్ని నెరవేర్చకుండా మొండి చేతులతో రాష్ట్రానికి రావడం మీకు ధర్మమా? మీరు ఎన్నికల సమయంలో ఇక్కడి ప్రజలకు ఇచ్చిన హామీల్ని, ప్రధాని అయ్యాక మర్చిపోయార’ని మండిపడ్డారు. మోదీ ఆదివారం రాష్ట్ర పర్యటనకు వస్తున్న నేపథ్యంలో చంద్రబాబు రాష్ట్ర ప్రజల తరఫున ఆయనకు బహిరంగలేఖ రాశారు.
మరో పక్క, ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు గుంటూరుకు విచ్చేస్తున్న నేపధ్యంలో జిల్లా వ్యాప్తంగా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. గుంటూరులో జరిగే బహిరంగ సభలో మోదీ పాల్గొననున్నారు. కాగా... మోదీ పర్యటనను అటు టీడీపీ, ఇటు వామపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ నిన్నటినుంచి నల్లజెండాలతో నిరసన తెలుపుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని సభా ప్రాంగణంతోపాటు జిల్లా వ్యాప్తంగా పోలీసులు పెద్దఎత్తున మోహరించారు. ఇదిలా ఉండగా విజయవాడలోని కనకదుర్గమ్మ వారధి, ప్రకాశం బ్యారేజీ వద్ద ఆదివారం తెల్లవారుజామునుంచే వాహనాల తనిఖీ జరుగుతోంది.