వినూత్న నిరసనలతో ప్రతి రోజు ఆంధ్రప్రదేశ్ సమస్యలు పై ఆందోళన చేసే టీడీపీ ఎంపీ శివప్రసాద్, ఈ రోజు మరో సారి పార్లమెంటు ఆవరణలో నిరసన తెలిపారు. రైతు వేషధారణలో వచ్చిన శివప్రసాద్ పార్లమెంటు ఆవరణలో నిరసనను వ్యక్తం చేశారు. ఏపీకి న్యాయం చేయాలని, విభజన హామీలను అమలు చేయాలని గత కొన్ని రోజులుగా టీడీపీ ఎంపీలు పార్లమెంటులో ధర్నాలు, నిరసనలు తెలుపుతున్న విషయం తెలిసిందే. నిరసనలో భాగంగా టీడీపీ ఎంపీ శివప్రసాద్ కావడితో రైతు వేషాధారణలో వచ్చి కేంద్ర ప్రభుత్వానికి తన నిరసనను తెలిపారు.
ఏపీ రాజధానికి ప్రధాని ఇచ్చిన మట్టి, నీటిని ఎంపీ శివప్రసాద్ రెండు కుండల్లో తీసుకొచ్చారు. కావడితో వచ్చిన శివప్రసాద్ పవిత్ర మట్టి, నీటిని స్పీకర్ ద్వారా తిరిగి మోడీకి ఇవ్వాలని పార్లమెంటులోకి వెళ్లేందుకు యత్నించారు. మెట్లు ఎక్కిన ఆయనను పార్లమెంటు సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. ఇలాంటివాటిని లోపలకు అనుమతించబోమని నవ్వుతూ చెప్పారు. కాసేపు అక్కడే ఉన్న శివప్రసాద్... చివరకు మెట్లు దిగి, కిందకు వచ్చేశారు. శివప్రసాద్ నిరసన కార్యక్రమాన్ని వివిధ పార్టీలకు చెందిన ఎంపీలంతా ఆసక్తిగా గమనించారు.
ఇదిలా ఉండగా సోమవారం నుంచి పార్లమెంటు మలివిడత సమావేశాలు ప్రారంభం కాగా మొదటి రోజు శ్రీకృష్ణుడి వేషం వేసిన ఎంపీ శివప్రసాద్.. రెండో రోజు ఎన్టీఆర్ గెటప్‌తో ఆకట్టుకున్నారు. తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ స్థాయిలో వినిపించిన ఎన్టీఆర్ వేషంలో పార్లమెంట్‌కు వచ్చి నిరసన వ్యక్తం చేశారు. 'చెయ్యెత్తు జై కొట్టు తెలుగోడా గతమెంతో ఘనకీర్తి కలవోడా ' అంటూ పాట కూడా పాడారు. ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని దెబ్బకొటితే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని కేంద్రాన్ని హెచ్చరించారు.