తాము భారత్‌లో నెలకొల్పదలిచిన మెట్రో రైల్ తయారీ కర్మాగారం ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ అత్యంత అనుకూలమైనదిగా భావిస్తున్నట్టు మలేసియాకు చెందిన ఎస్ఎంహెచ్ రైల్ కార్పొరేషన్ పేర్కొంది. రైలు ఇంజన్ల తయారీలో పేరొందిన మలేసియా కంపెనీ ఎస్ఎంహెచ్ రైల్ కార్పొరేషన్ ప్రతినిధులు ఆదివారం సింగపూర్‌లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. ఏపీలో పెట్టుబడులకు ‘ఎస్ఎంహెచ్’ ప్రతినిధులు ఆసక్తి చూపించగా ముఖ్యమంత్రి వారికి ఆహ్వానం పలికారు. జీఈ, సీమెన్స్, అల్‌స్టోమ్, జీఈ, హ్యుండయ్ వంటి సంస్థలతో తాము ప్రస్తుతం కలిసి పనిచేస్తున్నామని, తమ ఉత్పత్తిలో అత్యధిక శాతం ఎగుమతులే వుంటాయని ఆ సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ జహ్రీన్ జమాన్ ముఖ్యమంత్రికి వివరించారు. పాత లోకోమోటీవ్‌లను కొత్త లోకోమోటీవ్ యూనిట్లుగా మార్చడం, రైళ్ల చక్రాలు, రైలు ఇరుసు, ఎలక్ట్రిక్ రైళ్ల విడి భాగాల తయారీ ‘ఎస్ఎంహెచ్’ పేరుగాంచింది.
డస్సాల్ట్ సంస్థ... గాలి వాలును అంచనా వేసి ఉష్ణోగ్రతలను క్రమబద్దీకరించే సాంకేతికతను అభివృద్ధి చేసిన డస్సాల్ట్ సంస్థ అమరావతిలోనూ ఈ పరిజ్ఞానాన్ని వినియోగించేందుకు సిద్ధమవుతోంది. జల వనరుల సంరక్షణకు, నగరాన్ని ఆకుపచ్చగా ఉంచేందుకు ఈ సాంకేతికత ఎంతగానో దోహదపడుతుందని ఆ సంస్థ ప్రతినిధులు ముఖ్యమంత్రికి తెలిపారు. రాష్ట్రంలోని స్మార్ట్ నగరాల రూపకల్పనలోనూ డస్సాల్ట్ సేవలను వినియోగించు కుంటామని వారికి ముఖ్యమంత్రి వెల్లడించారు.
అమరావతి ప్రాజెక్టులో భాగంగా ఏపీతో కలిసి పనిచేస్తుండటం ఆనందంగా వుందని డస్సాల్ట్ సీఈవో బెర్నార్డ్ చార్లెస్ అన్నారు. ఇదే అంశంపై చైనా, సియోల్, సింగపూర్‌లతో కలిసి పనిచేస్తున్నామని, అక్కడి అనుభవాన్ని రంగరించి అమరావతిలో మరింత మెరుగ్గా పనిచేస్తామని ముఖ్యమంత్రికి మాటిచ్చారు. మరోవైపు స్థానిక విశ్వవిద్యాలయాలలో దీనికి సంబంధించిన కోర్సులను ప్రవేశపెట్టడానికి కూడా సహకరించాలని ముఖ్యమంత్రి కోరగా సెప్టెంబరులో అమరావతికి వచ్చి డిసెంబరు కల్లా అన్ని అంశాలపై కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తామని చార్లెస్ చెప్పారు.