మెగా సోలార్ ప్రాజెక్ట్ టెండర్లను రద్దు చేస్తూ హైకోర్టు నిర్ణయం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ తీర్పు తరువాత, తెలుగుదేశం పార్టీ, ప్రభుత్వం పై సంచలన ఆరోపణలు చేసింది. సోలార్ విద్యుత్ టెండర్లలో రూ.లక్షా.20 వేల కోట్ల కుంభకోణానికి పన్నాగం పన్నారు అంటూ, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, కిమిడి కళా వెంకట్రావు ఆరోపించారు. ఆయన మాట్లాడుతూ, "రాష్ట్ర అభివృద్ధికి ఆయువుపట్టులాంటి విద్యుత్ రంగాన్ని జే. ట్యాక్స్ కోసం జగన్ రెడ్డి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో విద్యుత్ రంగం నిర్వీర్యమవుతోంది. సోలార్ టెండర్లు రద్దుపై ముఖ్యమంత్రి ఎందుకు నోరు మెదపడం లేదు.? టెండర్లు రద్దుతో ప్రపంచ స్థాయిలో రాష్ట్రం, దేశ పరువు తీశారు. ఎవరి ప్రయోజనాల కోసం టెండర్లు నిబంధనలు మార్చారో సమాధానం చెప్పాలి. సోలార్ టెండర్లలో భారీగా అవకతవకలు జరగడం వల్లే టెండర్లను హైకోర్టు రద్దు చేసింది. వేలకోట్ల అక్రమాలకు పాల్పడి, ప్రజల సొమ్ము దోచుకుతినేందుకు సోలార్ విద్యుత్ ను అడ్డుపెట్టుకోవాలని చూశారు. రూ.లక్షా.20వేల కోట్ల ప్రజా ధనాన్ని దోచుకునేందుకు ఎసరు పెట్టారు. టెండర్లను అధికభాగం అదానీ, కడప ఎంపీ అవినాశ్ రెడ్డి బినామీ అయిన నర్రెడ్డి విశ్వేశ్వరరెడ్డికి చెందిన షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ సంస్థలకు కట్టబెట్టాలని చూశారు. అందుకే వైసీపీ నేతలు దీనిపై మాట్లాడకుండా తప్పించుకు తిరుగుతున్నారు. టీడీపీ హయాంలో పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ల కాలపరిమితి 25 ఏళ్లు ఉంటే వైసీపీ నేతలు గగ్గోలు పెట్టారు. మరి ఇప్పుడు అదే కాలపరిమితిని 30 ఏళ్లకు ఎలా పెంచారు.? గతంలో సోలార్ పవర్ అవసరంలేదని ఇప్పుడు 10వేల మెగావాట్లకు ఏ విధంగా టెండర్లు పిలిచారు? 30ఏళ్లకు రూ.లక్షా20వేల కోట్లకు ప్రణాళిక రూపొందించుకున్నారు. నిబంధనలు గాలికొదిలేసి టెంటర్లు పిలిచారు. కేంద్ర ప్రభుత్వం 2017లో విడుదల చేసిన కాంపిటీటివ్ బిడ్డింగ్ గైడ్ లైన్స్ నిబంధనలను జగన్ రెడ్డి పూర్తిగా తుంగలోతొక్కి పీపీఏలు విడుదల చేశారు. గైడ్ లైన్స్ లోని క్లాజ్ 5.7ప్రకారం ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ అనుమతి లేకుండా ఒప్పందాలకు సంబంధించి ఏవిధమైనమార్పులు చేయకూడదనే నిబంధనను లెక్కచేయలేదు. "
"దేశమంతా కనిష్టంగా రూ.1.90పైసలకే యూనిట్ సోలార్ విద్యుత్ లభిస్తుంటే, 60పైసలు అదనంగా పెంచి కట్టబెట్టి కమీషన్లకు కక్కుర్తిపడాలని చూశారు. పీపీఏలు రద్దు చేసి రాష్ట్ర పరువును తీశారు. ఇప్పుడు 6,400మెగావాట్ల సోలార్ విద్యుత్ఉత్పత్తికి ఎలా టెండర్లు పిలిచారో చెప్పాలి.? ఒప్పందం చేసుకున్నన్ని రోజులు ఒకటే టారిఫ్ ను ఎందుకు అమలుచేయాలనుకోలేదు.? దిక్కూమొక్కులేని కంపెనీలకు దోచిపెట్టాలనుకోవడంతోనే హైకోర్టు టెండర్లను రద్దు చేసింది. కోర్టు తీర్పుతో వైసీపీ అవినీతికి భంగం వాటిల్లింది. విద్యుత్ రంగాన్ని జగన్ రెడ్డి నాశనం చేశారు. నీటి లభ్యత సరిగాలేని సమయంలోనూ టీడీపీ 24 గంటల విద్యుత్ అందించింది. వర్షాలు సమృద్ధిగా కురిసి పుష్కలంగా నీలి లభ్యత వున్నా ప్రభుత్వం వద్ద ప్రణాలిక లేక విద్యత్ కోతలు విధిస్తున్నారు. తీవ్ర నష్టాలతో రైతులు అతలాకుతలమవుతుంటే బోర్లకు మీటర్లు బిగించి అప్పుల కోసం రైతుల ఉసురుతీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే విద్యుత్ ఛార్జీలు పెంచి సామాన్య ప్రజల డొక్కచించుతున్నారు. జగన్ రెడ్డి వచ్చాక రాష్ట్ర ఆదాయం చూస్తే జానెడు.. అప్పులు చూస్తే మూరెడు ఉంది. వ్యాక్సిన్ గ్లోబల్ టెండర్లు, రోడ్డు కాంట్రాక్టులకు, చిన్నచిన్న కాంట్రాక్టు పనులకు కూడా స్పందన రావడం లేదంటే కమీషన్లు ఏ స్థాయిలో అడుగుతున్నారో అర్థమవుతోంది. రాష్ట్రంలో ఎవరు అడుగుపెట్టాలన్నా వైసీపీ వాళ్లు అడిగే వాటాల దెబ్బతో హడలెత్తిపోతున్నారు. టెండర్ల పేరుతో ప్రజల సొమ్ము అప్పనంగా దోచుకుతింటామనంటే చూస్తూ ఊరుకోం." అని అన్నారు.