ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈ ఉదయం ఘోర ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. శ్రీకాకుళం జిల్లాలో తిత్లీ తుఫాన ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటించే నిమిత్తం వెళుతున్న వేళ ఈ ఘటన జరిగింది. సోమిరెడ్డి, ఆయన సిబ్బంది ప్రయాణిస్తున్న వాహనం టైర్లు పేలడంతో జాతీయ రహదారిపై అదుపుతప్పింది. దీంతో వాహనం స్కిడ్ అయి, డివైడర్ పైకి దూసుకెళ్లింది. అయితే, వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి, తన అనుభవాన్ని చూపిస్తూ, వాహనాన్ని అదుపు చేయడంతో ప్రమాదం తప్పింది. సోమిరెడ్డికి ఎటువంటి గాయాలు కాలేదు. ఆ తరువాత ఆయన మరో వాహనంలో తన పర్యటనను కొనసాగించారు. ప్రస్తుతం ఆయన మందస గ్రామంలో తుఫాను బాధితులను పరామర్శిస్తున్నారు.
అంతకు ముందు సోమిరెడ్డి శ్రీకాకుళంలో పర్యటించారు. వ్యవసాయ శాఖామాత్యులు పంట నష్టాల అంచనా నిక్కచ్చిగా తయారు చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖామాత్యులు సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి అధికారులను ఆదేశించారు. శని వారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో పంట నష్టాల ఎన్యూమరేషన్ పై నిర్వహించిన అవగాహనా కార్యక్రమానికి మంత్రి విచ్చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తిత్లీ తుఫాను వలన పలాస, ఇఛ్ఛాపురం, టెక్కలి నియోజక వర్గాలలో 13 మండలాలలో పంటలు బాగా దెబ్బతిన్నాయన్నారు. 1.39 లక్షల హెక్టార్లలో వరి పంట, 20 వేల హెక్టార్లలో ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయని తెలిపారు. వీటిలో జీడి, అరటి, కొబ్బరి పంటలు ఎక్కువగా దెబ్బతిన్నాయని చెప్పారు. ఏ ఒక్క రైతు కూడా నష్టపోరాదనే వుద్దేశ్యంతో
కేంద్ర సాయం కన్నా ఎక్కువ సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నదని తెలిపారు. వరి పంట అంచనాలకు 320 మందిని, ఉద్యానవన పంటల పరిశీలనకు 135 మందిని విశాఖపట్నం, విజయనగరం నుండి కూడా డిప్యూట్ చేయడం జరిగిందని తెలిపారు. పంట నష్టం కలిగిన ప్రతీ రైతుకు నష్ట పరిహారాన్ని త్వరితగతిన అందచేయడం జరుగుతుందని చెప్పారు. కొబ్బరి చెట్టుకు రూ. 1,000 లు, జీడి, మామిడికి హెక్టారుకు రూ.20 వేలు, అరటి పంటకు హెక్టారుకు రు.25 వేలు ఇన్ పుట్ సబ్సిడీని అందించడం జరుగుతుందని తెలిపారు. మూడు రోజులలో ఎన్యూమరేషన్ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వంశధార నీరు విడుదల ద్వారా శీకాకుళం, నరసన్నపేట, ఆముదాల వలస మండలాలలో 25 వేల హెక్టార్ల పంట నీట మునిగిందన్నారు. ఉద్యానవన అధికారుల సహకారంతో గ్రామాలలో ఎన్యూమరేషన్ చేయాలని తెలిపారు. ఉపాధిహామీ సిబ్బంది కూడా ఎన్యూమరేషన్ కు తోడ్పాటు అందించాలని చెప్పారు.