‘‘నాలుగు ముక్కలు ఇంగ్లిష్ రాదు.. రెండు ముక్కలు హిందీ రాదు. ఢిల్లీలో ఏం చక్రం తిప్పుతారు’’ అంటూ చంద్రబాబుపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ప్లే స్కూల్‌కి వెళుతున్న తన మనవడు ఇంగ్లిష్ మాట్లాడుతుంటే.. తాను అర్థం చేసుకోలేపోతున్నానని... అంత మాత్రానా ముఖ్యమంత్రిని చేస్తామా అని ప్రశ్నించారు. చిన్న చిన్న అటెండర్లు కూడా అద్భుతంగా ఇంగ్లిష్ మాట్లాడుతున్నారన్నారు. ‘‘అది కాదు కావలసింది ... మనం మాట్లాడింది అర్థం చేసుకుంటే చాలు. మీరు గొప్ప ప్రసంగీకులు.. ఇంగ్లీష్, హిందీ, ఉర్దూలలో బాగా మాట్లాడతారు. అంతగొప్పగా మాట్లాడే మీరు.. తెలంగాణ ప్రజలకు ఏం చేశారు? ఏం అభివృద్ధి చేశారు? కష్టాల్లో ఉన్న ఏపీ దరిదాపుల్లోకి కూడా రాలేకపోయారు’’ అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
అనుభవం, ముందుచూపు ఉన్న మహానాయకుడు చంద్రబాబు అని గతంలో మహబూబ్‌నగర్‌లో కేసీఆర్ పొగిడారని, ఈ రోజు తిడుతున్నారని మండిపడ్డారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘కేసీఆర్ వాడిన భాష అభ్యంతరకరంగా ఉంది. ఆయన మాటలు దారుణంగా ఉన్నాయి. కాంగ్రెస్ హయాంలో బడ్జెట్ గొర్రెతోక అని ఆనాడు కేసీఆర్ చెప్పారు. ఉమ్మడి ఏపీ బడ్జెట్‌ను రూ.50వేల కోట్లకు పెంచిన ఘనత చంద్రబాబుదేనని అన్నారు. చంద్రబాబు తెచ్చిన సంపదను వైఎస్‌ఆర్ వాడుకున్నారని, తొమ్మిదేళ్లు సీఎంగా చేసిన చంద్రబాబుపై వైఎస్‌ఆర్ వాడిన భాష సరికాదని గతంలో కేసీఆరే అన్నారు. వైఎస్‌ఆర్ వాడిన భాష సరికాదని చెప్పిన కేసీఆర్ ఈ రోజు అలా..ఎలా మాట్లాడతారు? మాయ మాటలు చెప్పేవారికే ప్రజలు బోల్తా పడుతున్నారు. కరీంనగర్‌ను న్యూయార్క్, వరంగల్‌ను లండన్, హైదరాబాద్‌ను డల్లాస్, యాదాద్రిని వాటికన్ సిటీ చేస్తానని కేసీఆర్ అన్నారు... ప్రజలు ఏమైనా ఇవన్నీ అడిగారా? నాలుగేళ్లలో వృద్ధి రేటులో అన్ని రంగాల్లో 10.5 శాతం వృద్ధితో ఏపీ అగ్రస్థానంలో ఉంది. ప్రత్యేక రాష్ట్రం ఇస్తే తెరాసను కాంగ్రెస్‌లో కలిపేస్తానని కేసీఆర్ అన్నారు. అధికారంలోకి వస్తే దళితుడిని సీఎం చేస్తానన్నారు. కేసీఆర్ ఇచ్చిన ఏ ఒక్క మాటైనా నిలబెట్టుకున్నారా?
ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించి ఓట్లు పొందినంత మాత్రాన గొప్పకాదు. తెలంగాణలో రైతులకు రూ.లక్ష రుణమాఫీ చేస్తే.. ఏపీలో రూ.1.5లక్షలు చేశాం. వ్యవసాయ అనుబంధ రంగాల్లో తెలంగాణ కంటే వృద్ధి సాధించాం. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే తెలంగాణకు నష్టం జరుగుతుందని హరీశ్‌రావే గతంలో మాట్లాడారు. ఈ రోజు కేసీఆర్ ప్రత్యేక హోదా ఇవ్వాలని అంటున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కేసీఆర్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలి. చంద్రబాబు చేసిన మోసం ఏంటో కేసీఆర్ చెప్పాలి. సీనియర్ రాజకీయ నాయకుడైన కేసీఆర్ వాడిన భాష వింటుంటే బాధ కలుగుతోంది. రెండోసారి సీఎం అయిన తర్వాత చులకనైన భాష వాడే ఏకైక సీఎంగా కేసీఆర్ నిలిచిపోతారు’’ అని సోమిరెడ్డి మండిపడ్డారు.