తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై రాష్ట్ర మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో పరిపాలన సాగకూడదని కేసీఆర్ కోరుకుంటున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణలో ఇంటర్ విద్యార్థులు ప్రాణాలు తీసుకుంటుంటే ఆపడం చేతకాని కేసీఆర్.. ఏపీలో వేలుపెడుతున్నారని దుయ్యబట్టారు. ఏపీలో పరిపాలన స్తంభించిపోవాలని హైదరాబాద్ కేంద్రంగా కుట్రలు సాగుతున్నాయని మంత్రి సోమిరెడ్డి ఆరోపించారు. తాను వ్యవసాయ శాఖలో సమీక్షలు చేస్తే ఆనం కు అభ్యంతరమేంటని ప్రశ్నించారు. కనీస నిబంధనలు కూడా తెలియని ఆనం.. ఆర్థిక మంత్రిగా ఎలా పని చేశారో ఆశ్చర్యంగా ఉందని ఎద్దేవా చేశారు.
ఏపీలో ఉన్నది ఆపద్ధర్మ ప్రభుత్వం కాదని, చంద్రబాబు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కాదని మంత్రి సోమిరెడ్డి వివరించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉంటే విధానపరమైన నిర్ణయాలు మాత్రమే తీసుకోరాదన్నారు. పాలన చేయొద్దని చెప్పడానికి మీరు ఎవరు? అంటూ వైసీపీ నేతలపై మంత్రి ఫైర్ అయ్యారు. ఈసీ, సీఎస్ కలిసి రాష్ట్రాన్ని పాలించాలని వైసీపీ కోరుకుంటోందన్నారు. ఆర్బీఐ రూల్స్ తెలియని వారు బాబుపై విమర్శలు చేస్తున్నారని మంత్రి సోమిరెడ్డి నిప్పులు చెరిగారు. ఈసీని పెట్టుకుని వ్యవస్థల్ని దెబ్బతీయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు.