కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పనితీరుపై యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ ప్రశంసలు కురిపించారు. దేశంలోని మౌలిక వసతులను అభివృద్ధి చేయడంలో ఆయన ‘‘అద్భుతంగా’’ కృషిచేశారన్న దానిపై ఆమె ఏకీభవించారు. లోక్‌సభలో ఇవాళ ప్రశ్నోత్తరాల సమయంలో... గడ్కరీ మంత్రిత్వ శాఖకు సంబంధించిన రెండు ప్రశ్నలపై చర్చ జరిగింది. దేశంలోని రహదారుల విస్తరణపై అమలు చేసిన పథకాలు, చేపట్టనున్న పనులపై ఆయన పూర్తి వివరణ ఇచ్చారు. ‘‘తమ తమ నియోజకవర్గాల్లో నా మంత్రిత్వ శాఖ చేపడుతున్న పనులపై పార్టీలకతీతంగా ఎంపీలు నన్ను మెచ్చుకుంటున్నారు..’’ అని ఆయన పేర్కొన్నారు. గడ్కరీ మాట్లాడుతున్నంత సేపూ సోనియా గాంధీ నవ్వుతూ, తలూపుతూ కనిపించడం విశేషం.
బీజేపీ సభ్యుల హర్షధ్వానాల మధ్య గడ్కరీ తన ప్రసంగాన్ని ముగించగానే... మధ్యప్రదేశ్ బీజేపీ ఎంపీ గణేశ్ సింగ్ లేచి నిలబడి ఓ ప్రతిపాదన చేశారు. ‘‘కేంద్ర రోడ్డు రవాణా మంత్రి చేపట్టిన అద్భుతమైన పనులను సభలోని సభ్యులంతా మెచ్చుకోవాలి..’’ అంటూ స్పీకర్ సుమిత్రా మహాజన్‌కు విన్నవించారు. వెంటనే లోక్ సభలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. అప్పటిదాకా గడ్కరీ చెబుతున్న విషయాలను ఎంతో ఓపికగా వింటున్న యూపీఏ ఛైర్ పర్సన్ సోనియాగాంధీ... గడ్కరీని అభినందిస్తూ బల్లను చరిచారు. ఆ తర్వాత లోక్ సభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ ఎంపీలందరూ బల్లను చరుస్తూ గడ్కరీని అభినందించారు.
కాగా రాయ్‌బరేలీ నియోజకవర్గ సమస్యలపై ‘‘సానుకూలంగా’’ స్పందించినందుకు గతేడాది ఆగస్టులో సోనియా గాంధీ నితిన్ గడ్కరీకి కృతజ్ఞతలు చెబుతూ లేఖ రాసినట్టు వార్తలు వచ్చాయి. ఉత్తర ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ నియోజకవర్గం నుంచి సోనియా గాంధీ లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఉత్తరప్రదేశ్ లోని తన నియోజకవర్గంలో ఉన్న రహదారుల సమస్యపై సానుకూలంగా స్పందించారంటూ గత ఆగస్టులో ధన్యవాదాలు తెలుపుతూ గడ్కరీకి సోనియా లేఖ రాశారు. 'ఇంటిని సరిగా చూసుకోలేనివారు.. దేశాన్ని ఎలా మేనేజ్ చేస్తారు' అంటూ ఇటీవల గడ్కరీ చేసిన వ్యాఖ్యలను రాహుల్ గాంధీ కూడా ప్రశంసించిన సంగతి తెలిసిందే. బీజేపీలో గట్స్ ఉన్న నేత మీరు మాత్రమేనంటూ గడ్కరీని ఉద్దేశించి రాహుల్ వ్యాఖ్యానించారు.