దాదపుగా సంవత్సర కాలంగా, అమెరికాలోని లాస్‌ఏంజెలెస్ ప్రధాన కేంద్రంగా ఉన్న సోనీ ఎంటర్‌టైన్‌మెంట్‌ను రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. అయితే, ఇప్పుడు ఈ ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమరావతికి సోనీ ఎంటర్‌టైన్‌మెంట్ లిమిటెడ్ రానుందని సమాచారం. సినిమాలు, సీరియళ్లు, మ్యూజిక్ తదితర రంగాల్లో సోనీ ఎంటర్‌టైన్‌మెంట్ అగ్రగామిగా ఉంది. మన దేశంలో ముంబై కేంద్రంగా సినిమాలు, సీరియళ్లను నిర్మిస్తోంది. ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో సోనీ అంటే ఒక బ్రాండ్. అంత పెద్ద బ్రాండ్ రాష్ట్రానికి వస్తే అది గేమ్ చేంజర్‌గా ఉపయోగపడుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
ఎప్పటి నుంచో ఈ సంస్థను తీసుకురావటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఒకసారి సోనీ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రతినిధులతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరిపింది. ఈ నెలలోనే మరోసారి ఆ సంస్థ ప్రతినిధులు రాష్ట్రానికి రానున్నారు. ఈసారి ఏదో ఒక ఒప్పందం జరిగే దిశగా చర్చలు ఉంటాయని తెలుస్తోంది. అమరావతిలో ఒక స్టూడియో నిర్మిస్తే, దానికి పూర్తి సహకారం అందించేందుకు సోనీ ఆసక్తి కనబరుస్తోంది. సాంకేతికంగా, వ్యాపారపరంగా అవకాశాలను తీసుకొచ్చేందుకు సహకరిస్తానంటోంది. ముంబై స్టూడియోల్లో తమ సంస్థ నిర్మిస్తున్న సినిమాలు, సీరియళ్లను కూడా ఇక్కడికే తీసుకొస్తామంటోంది.
సోనీ లాంటి సంస్థ వ్యాపార అవకాశాలు ఇచ్చేందుకు, సాంకేతిక సహకారం అందించేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తే...స్టూడియో నిర్మాణం తాము చేపడతామని తెలుగు సినీ పరిశ్రమలోని కొందరు ముందుకొస్తున్నట్లు తెలిసింది. మరో పక్క గన్నవరం మేథాటవర్స్‌లో ప్రారంభించిన హెచ్‌సీఎల్ స్టేట్ స్ర్టీట్ నెలరోజుల్లోనే విస్తరణకు సిద్ధమైంది. ప్రారంభ సమయంలో సుమారు 900 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. ఈ క్రమంలో చాలా త్వరలోనే అది విస్తరణ బాటకు సిద్ధమైంది. మరో 500 మందికి ఉద్యోగాలు ఇచ్చేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు త్వరలోనే నియామకాలు చేపడతామని ప్రభుత్వానికి మాటిచ్చింది.