ఇప్పటిదాకా దక్షిణాదిపై వివక్ష గురించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడులు మాత్రమే పోరాడుతూ వస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా కేరళ కూడా గొంతు కలుపుతోంది. కేరళ ఆర్థిక మంత్రి థామస్ ఇస్సాక్ దక్షిణాది రాష్ట్రాల ఆదాయాన్ని.. అభివృద్ధి అవసరాల పేరుతో ఉత్తరాది రాష్ట్రాలకు మళ్లించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు. ఇదే అంశంపై ఏప్రిల్ 10న తిరువనంతపురంలో దక్షిణాది రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అన్ని దక్షిణాది రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, ఆర్థిక శాఖ కార్యదర్శులకు లేఖలు రాశానని, అందరూ సమావేశానికి వస్తామని ఫోన్లో చెప్పారన్నారు.
దక్షిణాది రాష్ట్రాల ఆర్థిక మంత్రుల భేటీని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు రాష్ట్ర ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు వివరించారు. ఈ భేటీకి వెళ్లేందుకు ఆయన సీఎం అనుమతి కోరారు. దీనికి చంద్రబాబు సుముఖత వ్యక్తం చేశారు. అలాగే... కేరళ రాష్ట్ర ఆర్థికమంత్రి ఫోన్ చేయడాన్ని కూడా సీఎంకు యనమల వివరించారు. పథకాలకు కేంద్ర నిధుల మంజూరులో 2011 జనాభా ప్రామాణికతపై తీవ్ర వ్యతిరేకత వస్తోందని, 2011 జనాభా ప్రతిపదికన నిధులను కేటాయిస్తే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని తెలిపారు. కుటుంబ నియంత్రణను పాటించినందుకు దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల తగ్గిందని, ఇదే సమయంలో ఉత్తరాది జనాభా విపరీతంగా పెరిగిపోయింది.. కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో జనాభా నియంత్రణ లేని రాష్ట్రాలకు ఎక్కువ నిధులు వస్తున్నాయని చెప్పారు.
రాష్ట్రాలకు నిధుల పంపిణీకి 1971 జనాభా లెక్కలకు బదులు 2011 లెక్కలను పరిగణనలోకి తీసుకోవాలని పదిహేనో ఆర్థిక సంఘానికి కేంద్ర ప్రభుత్వం సిఫార్సు చేసినప్పటి నుంచి దక్షిణాది రాష్ట్రాలు ఆగ్రహంతో ఉన్నాయి. జనాభా నియంత్రణను పాటించి అభివృద్ధి సాధిస్తున్న రాష్ట్రాలకు శాపంగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు ఉండటం పట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాయి. కేంద్ర ప్రభుత్వ సిఫార్సును గట్టిగా వ్యతిరేకించాలని ఇప్పటికే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ట్వీట్ చేశారు. సిద్దరామయ్య ట్వీట్ వెలువడిన గంటల్లోనే కేరళ నుంచి సంఘీభావ ప్రకటన వచ్చింది. తొలి నిరసన వ్యక్తం చేసింది మాత్రం ఏపీ సీఎం చంద్రబాబే. కేంద్రం డబ్బులు, రాష్ట్రం డబ్బులు అంటూ ఉండవని, అన్నీ పన్ను చెల్లింపుదారు డబ్బులేనని అన్నారు. దీనికి కర్ణాటక సీఎం సిద్దరామయ్య మద్దతు పలుకుతూ, ‘‘కేంద్రానికి వచ్చే పన్నుల్లో 9.56 శాతం కర్ణాటక నుంచే అందుతున్నాయి. అందులో కేవలం 4.5 శాతమే తిరిగి రాష్ట్రానికి అందుతున్నాయి. దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతోంది’’ అన్నారు.