ఇప్పటిదాకా దక్షిణాదిపై వివక్ష గురించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడులు మాత్రమే పోరాడుతూ వస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా కేరళ కూడా గొంతు కలుపుతోంది. కేరళ ఆర్థిక మంత్రి థామస్ ఇస్సాక్ దక్షిణాది రాష్ట్రాల ఆదాయాన్ని.. అభివృద్ధి అవసరాల పేరుతో ఉత్తరాది రాష్ట్రాలకు మళ్లించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు. ఇదే అంశంపై రేపు, ఏప్రిల్ 10న తిరువనంతపురంలో దక్షిణాది రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశం ఏర్పాటు చేసారు. మోదీ హయాంలో నిధుల కేటాయింపులో దక్షిణాదికి జరుగుతున్న అన్యాయమే ఈ సమావేశం ప్రధాన అజెండాగా ఉంది. 14వ ఆర్థిక సంఘం నిబంధనల వల్ల ఏపీకి జరుగుతున్న నష్టం.. దక్షిణాదికి పనికి రాని కేంద్రం పథకాలు.. 15వ ఆర్థిక సంఘం విధి విధానాలవల్ల జరిగే నష్టాలపై మన రాష్ట్రానికి చెందిన ప్రతినిధులు వివరిస్తారని సమాచారం.
ఉపయోగం లేని పథకాలను తొలగించాలని లేదా ఆయా రాష్ట్రాల్లో కేంద్రం ఖర్చు చేస్తున్న మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకే ఇచ్చేయాలని ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్‌ను తీసుకుంటే.. కేంద్ర పథకాల్లో 83:17గా ఉన్న రాష్ట్ర వాటా 14వ ఆర్థిక సంఘం నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాత 69:31గా మారింది. ఆర్థికలోటులో ఉన్న ఏపీకి ఇది చాలా భారంగా మారింది. ఇక్కడి అవసరాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించే పథకాలకు నిధులు సర్దుబాటు చేయలేని దుస్థితి ఉంది. కేంద్ర పథకాలు అవసరం లేని రాష్ట్రాలకు ఆ మేర నిధులను ఆయా రాష్ట్రాలకే కేంద్రం ఇచ్చేయాలని 11వ ఆర్థిక సంఘమే చెప్పింది. కానీ కేంద్రంలోని పెద్దలు వీటిని పట్టించుకునే స్థితిలో లేరు. 14వ ఆర్థిక సంఘం తప్పుడు అంచనాల కారణంగా ఆంధ్రప్రదేశ్ ఏటా వేల కోట్ల రెవిన్యూ లోటు కోల్పోతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఉదాహరణకు గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో సొంత పన్నుల ఆదాయం రూ.77,784కోట్లు ఉంటుందని 14వ ఆర్థిక సంఘం అంచనా వేసి.. రెవిన్యూ లోటును రూ.37,817 కోట్లుగా తేల్చింది.
కానీ, రాష్ట్ర సొంత పన్నుల ఆదా యం రూ.50వేల కోట్లకు అటూ ఇటూగా ఉంది. ఇందులోని లోటే రూ.27 వేల కోట్లు. ఆర్థికసంఘం అంచనా వేసిన రెవిన్యూ లోటు.. పన్ను ఆదాయం లోటు కలిపితే ఈ మొత్తం లోటు రూ.64 వేల కోట్లకు చేరుకుంది. ఆ మేరకు నిధులు రాష్ట్రానికి రావాలి. కానీ రాలేదు. మూడేళ్లగా రాష్ట్రం విషయంలో జరిగింది ఇదేనని అధికారులు చెబుతున్నారు. సరాసరి రాష్ట్రం రూ.50 వేల కోట్లు కోల్పోయిందనేది వారి వాదన. ఆర్థిక సంఘం సిఫారసుల మేరకే ఐదేళ్ల పాటు నిధుల వస్తాయి కాబట్టి.. 15వ ఆర్థిక సంఘం నిబంధనలు, నిధుల కేటాయింపులో మొదటి నుంచీ పకడ్బందీగా వ్యవహరించాలనే నిర్ణయానికి వచ్చినట్లు అధికారులు తెలిపారు. రెవెన్యూ లోటు నిధిని రద్దు చేసే ఆలోచన.. 15వ ఆర్థిక సంఘం నిబంధనల్లో ఉండటంతో.. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు అధికారులు చెప్పారు. రాష్ట్రాలు తీసుకుంటున్న రుణాలపై కేంద్ర ప్రభుత్వ నిబంధనల్లో కొన్ని సవరణలు అవసరమని.. ఈ అంశంపై కూడా సమావేశంలో చర్చిస్తారని తెలిపారు.