జూన్ నెలలో జరిగిన మొదటి అసెంబ్లీ సమావేశంలో, మా పార్టీ అసలు ఫిరాయింపులు ప్రోత్సహించదు, మేము రాజీనామా చేసిన తరువాతే, పార్టీలోకి చేర్చుకుంటాం అంటూ జగన్ మోహన్ రెడ్డి చెప్పటం, దానికి స్పీకర్ తమ్మినేని కూడా సమర్ధిస్తూ మాట్లాడటం చూసాం. మొన్నా మధ్య , నలుగురు టిడిపి ఎంపీలు, బీజేపీలోకి విలీనం అయితే, అలా ఎలా కుదురుతుంది, నేను అయితే సస్పెండ్ చేస్తాను అంటూ తమ్మినేని, వెంకయ్య పై ఆగ్రహం వ్యక్తం చేసారు. అయితే ఇప్పుడు జరుగుతుంది మాత్రం వేరు. తెలుగుదేశం పార్టీ నుంచి గన్నవరం ఎమ్మెల్యేగా వల్లభనేని వంశీ ఎన్నికైన విషయం తెలిసిందే. ఆయన టిడిపి అధినేత చంద్రబాబు పై వ్యక్తిగత దూషణలకు దిగటంతో, టిడిపి షోకాజ్ నోటీస్ ఇచ్చి, సస్పెండ్ చేసింది. అయితే సస్పెండ్ మాత్రమే చేసింది, బర్తరఫ్ చెయ్యలేదు. అయితే మొన్న వంశీ అసెంబ్లీలో మాట్లాడుతూ, తనకు వేరే సీటు ఇవ్వాలని కోరటం, ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా గుర్తించాలని కోరటం తెలిసిందే.

vamsi 11122019 2

దానికి స్పీకర్ కూడా అంగీకరిస్తూ, వేరే స్థానం కేటాయించారు. అయితే ఈ చర్య పై తెలుగుదేశం పార్టీ ఈ రోజు స్పీకర్ ను కలిసి ఒక లేఖ అంద చేసింది. ప్రశ్నోత్తరాల సమయాన్ని వాయిదా వేసి మరీ, పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురైన సభ్యుడితో మాట్లాడించి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని తిట్టించడం గతంలో ఎప్పుడూ లేదని, సభలో మున్నెన్నడూ లేని దుష్ట సాంప్రదాయాలు ఇటీవల కాలంలో పెచ్చుమీరడం ప్రజాస్వామ్య వాదులకు ఆందోళన కలిగిస్తోందని టిడిపి ఆ లేఖలో పేర్కొంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు తెలుగుదేశం పార్టీ గన్నవరం శాసన సభ్యుడు వల్లభనేని వంశీని సస్పెండ్‌ చేశామేగాని పార్టీనుంచి బహిష్కరించలేదని, సస్పెన్షన్‌లోనే ఉన్నాడంటే ఆయన ఇంకా పార్టీ సభ్యుడేననేది మీకు తెలియందికాదని,ఇంకా టిడిపి సభ్యుడిగానే ఉన్నశ్రీ వల్లభనేని వంశీమోహన్‌ కి మీరు ప్రత్యేకంగా సీటు ఎలా కేటాయిస్తారు..? అంటూ తెలుగుదేశం పార్టీ ప్రశ్నించింది.

vamsi 11122019 3

పార్టీనుంచి సస్పెన్షన్‌ కు గురైన సభ్యుడికి నిన్న సభలో మాట్లాడే అవకాశం కల్పించడం ఒక తప్పిదం అయితే, తనకు బి ఫామ్‌ ఇచ్చిన టిడిపి అధ్యక్షుడినే ఆయన ద్వారా నిండుసభలో తిట్టించడం మరో తప్పిదం. ఆయన అడగగానే ప్రత్యేక సీటు కేటాయిస్తున్నట్లు ప్రకటించడం ఇంకో దుష్ట సాంప్రదాయం అంటూ టిడిపి స్పీకర్ ద్రుష్టికి తీసుకువచ్చింది. అయితే దీనికి స్పీకర్ సమాధానం ఇస్తూ, తనకున్న విచక్షణాధికారంతో వంశీకి మాట్లాడే అవకాశం ఇచ్చానని చెప్పారు. ప్రత్యేక సభ్యునిగా గుర్తించాలన్న వినతిని గౌరవిస్తున్నామని, ఎక్కడ కావాలంటే అక్కడ కూర్చోండని వంశీకి చెప్పానని స్పీకర్ అన్నారు. అయితే విచక్షణాధికారం వినియోగించి, పార్టీలో ఉన్న వ్యక్తికి, వేరే స్థానం ఎలా ఇస్తారని, టిడిపి ఆశ్చర్యంతో ప్రశ్నిస్తుంది. ఏది ఏమైనా స్పీకర్ విచక్షణాధికారాన్ని ఎవరూ ప్రశ్నించలేరు కాబట్టి, ఇప్పుడు టిడిపి ఏమి చేస్తుందో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read