తెలుగుదేశం పార్టీ నేతలకు అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం షాక్ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీలోని ముగ్గురు నాయకులకు సభాహక్కుల నోటీసులు జారీ చేశారు. నారా లోకేష్, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు, కూన రవికుమార్ కు సభాహక్కుల నోటీసులను స్పీకర్ కార్యాలయం అందించింది. అయితే లోకేష్ కు మాత్రం, నోటీస్ రాలేదని చెప్తున్నారు. స్పీకర్ తమ్మినేని సీతారాం పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు, అసెంబ్లీ సెక్రటరీ, ఆ ముగ్గురికి సభాహక్కుల నోటీసులు పంపారు. నోటీస్ పై వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని, ఆ నోటీసు లో తెలిపారు. దీని కంటే ముందు తెలుగుదేశం పార్టీ నేతలు, స్పీకర్ తమ్మినేని పై, విమర్శలు చేసారని, అందుకే ముగ్గురు ముగ్గురు టీడీపీ నాయకులకు సభా హక్కుల ఉల్లంఘన కింద నోటీసులు ఇవ్వనున్నట్లు ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి వెల్లడించిన సంగతి తెలిసిందే. వారు అనుకున్నట్టే, అసెంబ్లీ సెక్రటరీ, ముగ్గురు తెలుగుదేశం పార్టీ నేతలకు నోటీసులు పంపించారు.
మీదీ ఒక బతుకేనా...?, శాసనసభలో ఆంబోతు, దున్నపోతులా నిద్రిస్తున్నావ్ అంటూ అసభ్య పదజాలంతో అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం పై అచ్చెన్నాయుడు, కూన రవికుమార్ దూషించారని, వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అలాగే ఎమ్మెల్సీ నారా లోకేష్ కూడా లేఖ రాసి, స్పీకర్ స్థానాన్ని కించపర్చేలా వ్యాఖ్యలు చేసారని అన్నారు. స్పీకర్ స్థానాన్ని, ఆయన గౌరవాన్ని భంగపర్చేలా వ్యాఖ్యలు చేసిన అచ్చెన్నాయుడు, లోకేష్, కూన రవికుమార్‌కు సభా హక్కుల ఉల్లంఘన కింద నోటీసులు ఇవ్వనున్నట్లు చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని, వారు కనుక సారైన సమాధానం చెప్పకపోతే, తగిన చర్యలు తీసుకుంటామని వైసీపీ నేతలు హెచ్చరించారు.
అయితే, స్పీకర్ అ్రగిగోల్డ్ వ్యవహారంలో ప్రభుత్వ సాయం అందచేస్తున్న సమయంలో, చంద్రబాబు పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. గుడ్డలు ఊడదీసి, ప్రజల ముందు నుంచో పెడతాం అంటూ చంద్రబాబుని ఉద్దేశించి స్పీకర్ వ్యాఖ్యలు చేసారు. అలాగే, ఆయన అనుభవం అంట, మడిచి ఎక్కడో పెట్టుకోండి అంటూ స్పీకర్ చేసిన వ్యాఖ్యలకు, తెలుగుదేశం పార్టీ నేతలు కూడా అదే రీతిలో స్పందించటంతో, ఇప్పుడు స్పీకర్ పై వ్యాఖ్యలు చేసారని, సభా హక్కుల నోటీస్ ఇచ్చారు. వీరు ఇచ్చే సమాధానం, సంతృప్తి కరంగా లేకపోతే, ఈ మొత్తం వ్యవహారాన్ని స్పీకర్ ప్రివిలేజ్ కమిటీకి రిఫర్ చేసే అవకాశం ఉంది. గతంలో కొడాలి నాని, చెవిరెడ్డి భాస్కర రెడ్డి పై, నాడు అనేక సార్లు సభా హక్కుల ఉల్లంఘన ఫిర్యాదులు చేసినా, అవి చర్యల వరకు రాలేదు. మరి ఇప్పుడు ఏమి అవుతుందో చూడాలి.