అసెంబ్లీకి ఎన్ని సార్లు రమ్మన్నా, ఇప్పటి వరకు రాని వైసీపీ నేతలను, అసెంబ్లీ స్పీకర్ ఒక కోరిక కోరారు. ఇది ప్రజలకు ఉపయోగపడే కోరికే, మరి వాళ్ళు ఒప్పుకొంటారో లేదో. అదేమిటంటే, శాసన మండలి, శాసన సభ సభ్యులు తరుఫున ఒక నెల జీతాన్ని తిత్లీ బాధితులకు సాయంగా ప్రకటించామని, ప్రతిపక్ష పార్టీలకు చెందిన శాసన మండలి, శాసన సభ సభ్యులను కూడా వారి ఒక నెల జీతం ఇవ్వాలని కోరుతున్నట్టు ఏపీ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్ పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీలకు చెందిన సభ్యులు స్పందిస్తే మంచి పరిణామమేనని, లేకుంటే అధికార పార్టీ శాసన మండలి, శాసన సభ్యులు జీతాలు ఇస్తామని వెల్లడించారు. తిత్లీ తుపాను నష్టాన్ని ఆదుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం రిక్త హస్తమే చూపించిందని అన్నారు.
ఇంకా కేంద్రం సర్వే బృందాలు పరిశీలకు వచ్చి అంచనాలు వేసి, లెక్కలు కట్టి సాయం అందిస్తుందంటూ కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయని, ఆ ప్రక్రియ ఎంత త్వరగా చేస్తే, బాధితులకు అంత ఊరట కలుగుతుందన్నారు. మంగళవారం జిల్లా పర్యటనలో భాగంగా ఆయన పలాస మండలం పెద్ద గురుదాసుపురంలో మాట్లాడారు. తిత్లీ తుపానుతో నష్టపోయిన రైతాంగం త్వరగా కోలుకోవాలంటే మొక్కలు పెంపకంతో పాటు అంతర పంటలు వేసుకోవడం చాలా ముఖ్యమంటూ అక్కడ రైతులతో మాట్లాడుతూ సూచించారు. తన కుటుంబం తరుఫున ఐదు లక్షల రూపాయలు విరాళం ప్రకటించారు. మూడేళ్ళలో ఫలసాయం ఇచ్చే మొక్కలు ఉపాధి హామీ పథకం నుంచి ప్రభుత్వం ఏర్పాటు చేసి ఆదుకుంటుందన్నారు.
సోంపేట మండలంలో నేలమట్టమైన కొబ్బరి తోటలు, జీడిమామిడి, పడిపోయిన ఇళ్లను స్పీకర్ శివప్రసాద్ పరిశీలించారు. ఉద్దానానికి తీవ్రమైన నష్టం జరిగిందని, ఆ నష్టాన్ని మరింత వేగవంతంగా పూరించడానికి ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందన్నారు. హుదూద్ తుపాను నేర్పిన పాఠాలతో తిత్లీ తుపానులో అపార నష్టాన్ని ఏవిధంగా ఎదుర్కోవాలన్నది ప్రభుత్వం ఇప్పటికే ఆచరణలో పెట్టి చూపించిందన్నారు. ఎర్రముక్కాంలో తుపాను బాధితులతో స్పీకర్ మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని విధాలుగా మిమ్మల్ని ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. మండల ప్రాథమిక పాఠశాలలో గ్రామస్తులను పరామర్శించి ప్రభుత్వం సరఫరా చేస్తున్న నిత్యావసర సరకులు, నీరు అందుతున్నదీ లేనిది ప్రజలను అడిగి స్పీకర్ తెలుసుకున్నారు. రాజాం దారిపోడవునా జీడితోటలు, కొబ్బరి తోటలను పరిశీలించారు. తీవ్రంగా నష్టం వాటిల్లిందని, తాను గుంటూరు వాసినేనని సముద్రం పక్కనే మా ఊరు ఉందని ఏనాడూ ఇంత నష్టం జరగలేదని బాధితుల్లో ఆత్మస్థైర్యం నింపేలా మాట్లాడారు.