దేశానికి, మన రాష్ట్రానికి చేసిన ద్రోహం గురించి తెలిపే, ఒక మంచి అవకాశం వచ్చింది. అప్పట్లో కాంగ్రెస్, బీజేపీ కలిసి, వివిధ పార్టీల సమక్షంలో అశాస్త్రీయ విభజన చేసి, మన గొంతు కోసిన చోటే నిలబడి, నాలుగేళ్ళు అయినా, మాకు న్యాయం జరగలేదు, మీరందరే అప్పటి ద్రోహానికి సాక్షి, ఇవాళ మళ్ళీ మోసం చేశారు , మాకు న్యాయం చెయ్యండి అని, అదే పార్టీల మధ్య, పార్లమెంట్ లో, నిలదేసే సమయం వచ్చింది. రేపు అవిశ్వాసం సందర్భంగా, మన రాష్ట్ర సమస్యలు చెప్పి, న్యాయం జరపమని, ఇచ్చిన హామీలు నేరవేర్చమని, ఈ దేశాన్ని కోరే రోజు. అయితే, ఇంతటి కీలకమైన సమావేశంలో, ఎవరు మాట్లడాలి అనే దాని పై, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర కసరత్తు చేసారు. వైసిపీ ఎంపీలు లేకపోవటంతో, ఇప్పుడు బాధ్యత అంతా తెలుగుదేశం ఎంపీల పై పడింది. 5 కోట్ల మంది తరుపున, వారే ఇప్పుడు ఈ దేశానికి, మనకు జరిగిన అన్యాయం చెప్పాలి. అందుకే మంచి స్పీకర్స్ ని చంద్రబాబు ఎంపిక చేసారు.
అవిశ్వాస తీర్మానంపై చర్చలో మాట్లాడేందుకు సిద్ధం కావాలని ఎంపీలు గల్లాజయదేవ్, రామ్మోహన్నాయుడు, కేశినేని నానికి సీఎం చంద్రబాబు ఆదేశించారు. కేశినేని నాని తీర్మానం ఇచ్చారు కాబట్టి, ఆయనే చర్చ మొదలు పెట్టాలి, తరువాత మనకు ఇచ్చిన టైంలో, సమర్ధవంతంగా చెప్పటానికి, గల్లాజయదేవ్, రామ్మోహన్నాయుడును కూడా చంద్రబాబు సిద్ధం అవ్వమని చెప్పారు. గల్లా ఇంగ్లీష్ లో, రామ్మోహన్నాయుడు హిందీలో మాట్లాడే అవకాశం ఉంది. గురువారం ఎంపీలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. అవిశ్వాస తీర్మానంపై చర్చను టీడీపీనే ప్రారంభించాలని తెలిపారు. చర్చ ముగింపు కూడా టీడీపీతోనే జరగాలని ఎంపీలకు సీఎం సూచనలు చేశారు. విభజన చట్టంలో ఉన్న 19 అంశాలపై విస్తృతంగా చర్చించాలని, మద్దతిచ్చే అన్ని పార్టీల నేతలతో మాట్లాడాలని ఎంపీలకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.
ముగింపు ఉపన్యాసం హిందీలో ఇస్తే దేశం మొత్తానికి విషయం అర్థం అవుతుందని, రామ్మోహన్ నాయుడుకు హిందీలో ప్రావీణ్యం ఉన్నందువల్ల ఆయనకు ఆ అవకాశం ఇస్తే బాగుంటుందని ఒక అధికారి సూచించారు. సభలో టీడీపీకి ఎంత సమయం కేటాయిస్తారన్న దానిపైనా చర్చ జరిగింది. అవిశ్వాస తీర్మానంపై చర్చ కాబట్టి ఎక్కువ సమయమే ఇచ్చే అవకాశముందని సీఎం అభిప్రాయపడ్డారు. ఇతర పార్టీలు అవిశ్వాస తీర్మానం సందర్భంగా జాతీయ అంశాలు, ఇతర రాష్ట్రాల అంశాలు ప్రస్తావించే అవకాశం ఉందని ఒక మంత్రి పేర్కొన్నారు. ఆ పరిస్థితి సహజంగానే ఉంటుందని, అన్ని పార్టీల నేతలను ముందుగా కలిసి మాట్లాడి ఏపీకి జరిగిన అన్యాయాన్ని కూడా ప్రస్తావించాలని కోరాలని ఎంపీలకు సూచించారు.