నంద్యాల సిట్టింగ్ ఎంపీ ఎస్పీవైరెడ్డి, ఆయన అల్లుడు సజ్జల శ్రీ్ధర్‌రెడ్డి పార్టీ వీడడంతో తెలుగుదేశం పార్టీ అధిష్టానం నష్టనివారణ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఎంపీ కూతురు సుజలకు ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. కూతురుకు ఎమ్మెల్సీ ఇవ్వనున్నందున పోటీనుంచి తప్పుకుని పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని ఎంపీ ఎస్పీవైరెడ్డిని అధిష్టానం బుజ్జగించినట్లు తెలుస్తోంది. తన కుటుంబానికి టికెట్ దక్కకపోవడంతో అలకబూనిన ఎంపీ ఎస్పీవైరెడ్డి తన అల్లుడితో కలిసి టీడీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరిన సంగతి తెలిసిందే. అంతేగాక నంద్యాల ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలకు జనసేన పార్టీ తరుపున నామినేషన్ పత్రాలు దాఖలు చేయడంతో తెలుగుదేశం పార్టీ అధిష్టానం వేగంగా నష్టనివారణ చర్య చేపట్టింది.
ఎస్పీవైరెడ్డిని అమరావతికి రమ్మని కబురు పంపగా, ఆయన కుమార్తె సజ్జల సుజల శనివారం అమరావతికి చేరుకుని టీడీపీ అధిష్టానంతో చర్చలు జరిపినట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. దీనిపై నంద్యాల ఎంపీ ఎస్పీవైరెడ్డిని వివరణ కోరగా తెలుగుదేశం పార్టీ అధిష్టానం నుండి కబురు వచ్చిన విషయం వాస్తవమేనని అన్నారు. తన కుమార్తె సజ్జల సుజల అమరావతి చేరుకుని టీడీపీ అధిష్టానంతో చర్చలు జరిపారన్నారు. అధిష్టానం ఆమెకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని హామీ ఇచ్చిందన్నారు. అయితే టీడీపీ ఇస్తున్న ఆఫర్ స్వీకరించడంపై పునరాలోచిస్తామని ఆయన తెలిపారు. ఇంత దూరం వచ్చాకా, జనసేన తరపున ఎంపీ, ఎమ్మెల్యే సీట్లకు నామినేషన్లు వేసి, ప్రచారం ప్రారంభించిన అనంతరం జరుగుతున్న పరిణామాల పట్ల ఆయన పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది.
ఎమ్మెల్సీ ఆఫర్‌ను స్వీకరించి జనసేన పార్టీ తరపున వేసిన నామినేషన్ పత్రాలను ఉపసంహరించుకుని తెలుగుదేశం పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల గెలుపుకోసం పనిచేయాలని అధిష్టానం ఆదేశించడంతో ఎస్పీవైరెడ్డి నిర్ణయంపై అందరి దృష్టి పడింది. ఇదే సమయంలో జనసేన నాయకుల్లో టెన్షన్ మొదలైంది. కాగా ఎమ్మెల్సీ ఆఫర్ ప్రకటించిన టీడీపీ అధిష్టానం నిర్ణయాన్ని స్వాగతించాలా, లేక జనసేన పార్టీ తరపున బరిలోకి దిగి తాడోపేడో తేల్చుకోవాలా అన్న విషయంపై కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులతో కలిసి చర్చించి నిర్ణయం తీసుకోవాలని ఎస్పీవైరెడ్డి భావిస్తున్నట్లు సమాచారం. రెండు రోజుల్లో దీనిపై స్పష్టత వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.