అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అంటూ, వైసీపీ పార్టీ, ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి ఆరోపణలు చేస్తూనే ఉంది. ప్రభుత్వంలోకి వచ్చిన తరువాత వరదలు సాకుగా చూపి, అక్కడ నుంచి రాజధాని తరలించే ఆలోచనలో ఉంది. అయితే ఈ విషయం పై, ప్రతిపక్షాలకు, అధికార పక్షానికి మధ్య మాటల దాడి జరుగుతున్న సందర్భంలో, మంత్రి బొత్సా సత్యన్నారాయణ, తెలుగుదేశం నేత, సినీ హీరో నందమూరి బాలక్రిష్ణ వియ్యంకుడి పై ఆరోపణలు చేసారు. ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి, ఏమన్నా కొత్త విషయాలు బయట పెడతారు అనుకుంటే, అప్పట్లో సాక్షి పేపర్ లో వచ్చిన కధనాలే, ఇప్పుడు మళ్ళీ బొత్సా చెప్పుకొచ్చారు. చంద్రబాబు వియ్యంకుడి వియ్యంకుడికి, జగ్గయ్యపేట మండలం జయంతీపురం గ్రామంలో, ఎకరా లక్ష చొప్పున, 493 ఎకరాలు ప్రభుత్వం అప్పనంగా ఇచ్చి, దాన్ని రాజధాని ప్రాంతంలో కలిపారని ఆరోపణ చేసారు.
అయితే, బొత్సా చేసిన ఆరోపణల పై, బాలయ్య వియ్యంకుడి కుటుంబం తరుపున, బాలకృష్ణ చిన్న అల్లుడు, గీతం విద్యా సంస్థల అధ్యక్షుడు ఎ.భరత్ స్పందిస్తూ, బొత్సా వ్యాఖ్యలను ఖండించారు. బొత్సా ఆరోపణలకు సంబంధించి, పూర్తీ ఆధారాలతో సహా, మీడియా ముందుకు వచ్చి, దాదపుగా 25 డాక్యుమెంట్లు మీడియా ముందు పెట్టి, బొత్సా వ్యాఖ్యలను ఖండించారు. అసలు ఈ భూమి మాకు ఇచ్చింది వైఎస్ఆర్ హయంలోనే అంటూ బాంబు పేల్చారు భరత్. దానికి సంబధించి ఆధారాలు ఇచ్చారు. అమరావతికి 120 కిలోమీటర్ల దూరంలో ఈ భూమి ఉందని, దీని పై బొత్సా తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. కృష్ణా జిల్లా జయంతిపురంలో గ్యాస్ బేస్ పవర్ ప్లాంట్ కోసం 2007లో 498.39 ఎకరాలు అప్పటి ప్రభుత్వం ఇచ్చిందని చెప్పారు.
తరువాత కిరణ్ కుమార్ రెడ్డి హయంలో, దీని పై జీవో వచ్చిందని, అప్పట్లో కిరణ్‌కుమార్ రెడ్డి మంత్రివర్గంలో బొత్స మంత్రిగా ఉండగానే భూములు కేటాయించారని స్పష్టంచేశారు. అయితే ఈ భూమి పై, న్యాయపరమైన వివాదం రావటంతో, ఇప్పటికీ ఈ భూమి మా కంపెనీకి అప్పచెప్పలేదని అన్నారు. ఎప్పుడో రాష్ట్ర విభజనకు ముందు ఇవన్నీ జరిగాయని, బాలకృష్ణ గారి కుటుంబంతో సంబంధాలు పెట్టుకోక ముందే, తన పెళ్లికి ఆరేళ్ల ముందే తాము ఆ ప్రాజెక్టు గురించి ఆలోచించామన్నారు. ఈ వ్యవహారంలో అసలు ఎక్కడా తెలుగుదేశం పాత్ర లేదని భరత్ చెప్పారు. అమరావతిని తప్పుదోవ పట్టించి, చంద్రబాబు పై బురద చల్లి, ఎదో ఒక విధంగా ప్రజలను మభ్యపెట్టె ఆలోచన చేస్తున్నారని భరత్ అన్నారు. ఒక మంత్రి హోదాలో ఆరోపణలు చేసేప్పుడు, ఆధారాలతో ఆరోపణలు చెయ్యాలని అన్నారు. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి, 2007 నుంచి ఇప్పటి వరకు ఉన్న వివిధ డాక్యుమెంట్లు భరత్ బయట పెట్టారు.