టీడీపీ అధినేత ఇవ్వజూపిన లోక్ సభ విప్ పదవిని వద్దని కలకలం రేపి, ఆపై చంద్రబాబుతో రెండు గంటల పాటు చర్చించి, తనకు ఏ పదవీ వద్దని, పార్టీలోనే ఉంటానని స్పష్టం చేసిన విజయవాడ ఎంపీ కేశినేని నాని, ఈ ఉదయం తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ ఆసక్తికర ట్వీట్ పెట్టారు. శ్రీశ్రీ రచనల్లోని ఎంతో పాప్యులర్ అయిన వాక్యం "పోరాడితే పోయేదేమి లేదు. బానిస సంకెళ్ళు తప్ప..." అని పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ వెంటనే వైరల్ అయింది. దీన్ని చూసిన ఆయన అభిమానులు కేశినేని ఏదో అసంతృప్తితో ఉన్నారని, కీలక నిర్ణయం ఏదో తీసుకోనున్నారని కామెంట్లు చేస్తున్నారు. లోక్‌సభలో పార్టీ విప్ పదవి తీసుకోవడానికి ఆయన నిరాకరిస్తూ, తన నిర్ణయాన్ని బుధవారం ఉదయం తన ఫేస్బుక్ ఖాతాలో పెట్టారు. ఆయన పార్టీని వీడబోతున్నారన్న ప్రచారానికి ఇది దారితీసింది. సాయంత్రం ఆయన పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును కలిసి తన అసంతృప్తికి కారణాలను వివరించారు.
తాను పార్టీ మారడం లేదని, టీడీపీలోనే ఉండి పనిచేస్తానని, ఆ తర్వాత ఆయన మీడియా వద్ద ప్రకటించారు. మంగళవారం రాత్రి చంద్రబాబు వద్ద జరిగిన సమావేశంలో లోక్‌సభలో టీడీపీ తరఫున విప్‌గా, ఉప నేతగా నాని పేరును ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకొన్న విషయం తెలిసిందే. లోక్‌సభకు టీడీపీ తరఫున ఈసారి ముగ్గురు ఎంపీలు గెలిచారు. ఈ ముగ్గురూ రెండోసారి గెలిచినవారే. వీరిలో గల్లా జయదేవ్‌ను పార్లమెంటరీ పార్టీ నేతగా, కింజరాపు రామ్మోహన్నాయుడును లోక్‌సభ పక్ష నేతగా గతంలోనే ప్రకటించారు. నానికి విప్ బాధ్యతలపై ఇప్పుడు నిర్ణయం తీసుకొన్నారు. ఈ పదవి తీసుకోలేకపోతున్నానంటూ నాని తన ఫేస్బుక్ పేజీలో బుధవారం ఉదయం పోస్టింగ్ పెట్టారు.
‘నన్ను లోక్‌సభలో పార్టీ విప్‌గా నియమించిన పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు. కానీ ఇంత పెద్ద పదవిని నిర్వహించడానికి నేను సరిపోనని భావిస్తున్నాను. నా కంటే మరింత సమర్థుడిని ఆ పదవిలో నియమిస్తే బాగుంటుందని నేను ఆయనకు విజ్ఞప్తి చేస్తున్నాను. విజయవాడ ప్రజలు నన్ను ఆశీర్వదించి తమ ఎంపీగా ఎన్నుకొన్నారు. ఈ పదవుల కన్నా విజయవాడ ప్రజలకు పూర్తి సమయం వెచ్చించి పనిచేయడం నాకు ఆనందం. నాపై నమ్మకం ఉంచిన చంద్రబాబు గారికి మరోసారి కృతజ్ఞతలు. నాకు ఇచ్చిన పదవిని తిరస్కరిస్తున్నందుకు క్షమాపణలు’ అని నాని అందులో పేర్కొన్నారు.