ఆరు రోజుల తరువాత శ్రీకాకుళం వచ్చి, ఇంకా ఎందుకు కరెంటు ఇవ్వలేదు అని ప్రశ్నిస్తున్న పవన్ కళ్యాణ్ గారు, ఒకసారి అక్కడ జరుగుతున్న విషయాలు తెలుసుకోండి. రాష్ట్ర ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ చెప్పిన విషయాలు ఒకసారి చూడండి. మీరు చంద్రబాబు కష్టానికి ఎలాగూ గౌరవం ఇవ్వరు, కనీసం అధికారులు, సిబ్బంది చెప్తున్న మాటలన్నా విని, వారు పడుతున్న కష్టాన్ని అభినందించండి. నగరంలోని ట్రాన్స్ కో పర్యవేక్షక ఇంజినీర్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో అజయ్ జైన్ మాట్లాడారు. తిత్లీ తుపాను సందర్భంగా దాదాపు 170 కిలోమీటర్లు వేగంతో సుమారు అయిదు నుంచి ఆరు గంటల పాటు గాలులు వీచాయన్నారు. ఈ గాలులకు సబ్‌స్టేషన్లు మినహా విద్యుత్తు వ్యవస్థ పూర్తిగా దెబ్బతిందని తెలిపారు.
జిల్లాలో 33,300 స్తంభాలు కూలిపోయాయని.. వజ్రపుకొత్తూరు, మెళియాపుట్టి, నందిగాం, కోటబొమ్మాళి, సంతబొమ్మాళి, సొంపేట, పలాస, కవిటి, కంచిలి, ఇచ్ఛాపురం, పోలాకి, నరసన్నపేట, హిరమండలం, భామిని, కొత్తూరు మండలాల్లో విద్యుత్తు వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడిందన్నారు. ఏడు ట్రాన్స్‌కో హైటెన్షన్ విద్యుత్తు టవర్లు దెబ్బతిన్నాయని, ఇవి పంట పొలాల్లో నడుంలోతు నీటిలో ఉండటం వల్ల పునరుద్ధరణ చాలా కష్టమయిందని చెప్పారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి అవసరమైన విద్యుత్తు స్తంభాలను పెద్దఎత్తున తెప్పిస్తున్నామని, విద్యుత్తు లైన్ వేయడం పునరుద్ధరణ అనిపించుకోదని.. ఏకంగా పునర్నిర్మాణంగానే భావించాలని వెల్లడించారు. గోతులు తీయడానికి 20 డ్రిల్లింగ్ యంత్రాలు, 250 క్రేన్లు వచ్చాయని వివరించారు. జిల్లాలో ఇప్పటికే పనిచేస్తున్న 7500 మంది సిబ్బందికి అదనంగా మరో 2400 మంది సిబ్బంది వస్తున్నారని ఆయన వెల్లడించారు.
చివరి ఇంటికి విద్యుత్తు సరఫరా జరిగేంతవరకు మొత్తం పది వేల మంది సిబ్బంది జిల్లాలోనే ఉంటారని వెల్లడించారు. దసరా పండుగకు జిల్లాలో పనిచేస్తున్న అన్ని స్థాయిల విద్యుత్తు శాఖ అధికారులు, ఉద్యోగులు, ఇతర సిబ్బంది ఎవరూ తమ ఇళ్లకు వెళ్లలేదన్న విషయాన్ని ప్రజలు గుర్తించాలని కోరారు. దసరా రోజు ఉదయం నాటికి అన్ని మండల కేంద్రాలకు, మెళియాపుట్టికి మాత్రం శుక్రవారం పునరుద్ధరించామని తెలిపారు. పలాస వద్ద గల పవర్‌గ్రిడ్ దెబ్బతినడంతో రాష్ట్రంతో పాటు తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలకు సైతం విద్యుత్తు సమస్య ఏర్పడిందని పేర్కొన్నారు. గురువారం నాటికి ఆయా పనులు పూర్తిచేయగలిగామన్నారు. రానున్న రోజుల్లో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో గుండ్రంగా ఉండే స్పన్ స్తంభాలను వేసేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఈ స్తంభాలు 180 కిలోమీటర్ల వేగంతో వచ్చే గాలులను సైతం తట్టుకోగలవని వివరించారు. కోస్తా తీరంలోని తొమ్మిది జిల్లాల్లోనూ రానున్న ఆరునెలల్లో ఈ పనులు చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నామని చెప్పారు.