దేశ రక్షణ కోసం తన ప్రాణాలు పణంగా పెట్టిన వీరజవాన్ లావేటి ఉమామహేశ్వరరావు త్యాగం చూసి సిక్కోలు గడ్డ గర్విస్తోందని శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామమోహన్‌నాయుడు పేర్కొన్నారు. బాంబు స్క్వాడ్లో పనిచేస్తున్న శ్రీకాకుళానికి చెందిన ఉమామహేశ్వరరావు గల్వాన్ లోయకి 100 కిలోమీటర్ల దూరంలో వున్న ప్రాంతంలో బాంబులను నిర్వీర్యం చేస్తుండగా, ఒక బాంబు పేలి మృతి చెందటం తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు. మనకోసం తమ ప్రాణాలు సైతం పణంగా పెడుతున్న జవాన్ల త్యాగం వెలకట్టలేనిదన్నారు. అమరజవాన్ పిల్లలిద్దరి చదువు కోసం చెరో 25 వేలు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తానని తెలిపారు. యుద్ధంలో అమరులైన జవాన్ల కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వాలు, స్థానిక పెద్దలు, మీడియా పెద్ద ఎత్తున ముందుకొచ్చేవనీ, దురదృష్టవశాత్తూ ఉమామహేశ్వరావు విషయంలో ఎవరూ దృష్టి సారించకపోవడం బాధగా వుందన్నారు. ఆర్మీలో 17 సంవత్సరాలకు పైగా సర్వీసు పూర్తిచేసి, మరికొద్ది సంవత్సరాలలో రిటైర్ కానున్న ఉమామహేశ్వరరావు సరిహద్దుల్లో శత్రువుతో పోరాటం కంటే భయంకరమైన బాంబుల్ని నిర్వీర్యం చేస్తూ చనిపోవడం అత్యంత విషాదకరమన్నారు.
అమరజవాన్ కుటుంబాన్ని ఆదుకోవాల్సి బాధ్యత మనందరిపైనా వుందన్నారు. ఇద్దరు ఆడపిల్లల భవిష్యత్ ఇప్పుడు అగమ్యగోచరంగా మారిందని, వీరి భవిష్యత్‌కు భరోసా ఇవ్వాల్సి వుందన్నారు. సైనికుడి త్యాగాలు మనలో స్ఫూర్తి నింపాలనే ఉద్దేశంతో యువత ఎక్కువగా వచ్చే ప్రదేశంలో మన సిక్కోలు సింహం లావేటి ఉమామహేశ్వరరావు విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానన్నారు. పుల్వామా, గల్వాన్ లోయలో శత్రువులతో పోరాడి అమరులైన సైనికులను కుటుంబాలను ఆదుకున్న మాదిరిగానే అమరుడైన లావేటి ఉమామహేశ్వరావు కుటుంబాన్నీ ఆదుకోవాల్సిన అవసరం వుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకూ ఎందుకు స్పందించలేదో అర్థంకావడంలేదని ఎంపీ ఆవేదన వ్యక్తం చేశారు.