తిత్లీ తుపాను ధాటికి జిల్లాలో కుప్పకూలిన విద్యుత్తు వ్యవస్థను గాడిన పెట్టేందుకు జిల్లా అధికారులు యత్నాలు ముమ్మరం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం అర్ధరాత్రి దాటిన తరువాత కూడా సమీక్షలు నిర్వహిస్తూ అయిదు జిల్లాల నుంచి రప్పించిన ఉన్నతాధికారులు, సిబ్బందితో పనులు పరుగులెట్టిస్తున్నారు. విద్యుత్తు సిబ్బంది, స్థానికుల సహకారంతో శ్రీకాకుళం, టెక్కలి, పాలకొండ డివిజన్లలో విద్యుత్తు స్తంభాలు వెలికితీసే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అయితే భారీ నష్టం సంభవించినా విద్యుత్తు సరఫరా పునరుద్ధరణ పనులు మాత్రం నత్తనడకగా సాగుతున్నాయి.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హుటాహుటిన జిల్లాకు చేరుకుని పనులు పర్యవేక్షించడంతో ప్రత్యామ్నాయ పద్ధతుల ద్వారా సరఫరా ఇవ్వడానికి అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టి కొంత వరకు సఫలీకృతం అయ్యారు. అయినా జిల్లాలోని 38 మండలాల్లో ఎంతో కొంత ప్రభావం ఉంది. తిత్లీ ప్రభావిత ప్రాంతాలను హెలికాప్టర్‌పై నుంచి పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఎట్టి పరిస్థితిల్లో విద్యుత్తు సరఫరా పునరుద్ధరణకు ఉన్నతాధికారులంతా పూర్తి స్థాయిలో పనిచేయాలని ఆదేశించారని అధికారులు చెబుతున్నారు. రెండు రోజుల్లో నీటిమట్టం తగ్గితే పూర్తి నష్టం అంచనాలు తెలుస్తాయని చెబుతున్నారు. విశాఖపట్నం తదితర ప్రాంతాల నుంచి విద్యుత్తు స్తంభాలను తెప్పించి కూలిన వాటి స్థానంలో ఏర్పాటు చేసి సరఫరా చేయడానికి చర్యలు చేపడుతున్నారు.
శ్రీకాకుళం, పాలకొండ డివిజన్లలో 75 శాతం గ్రామాలకు సరఫరా పునరుద్ధరించిన అధికారులు.. టెక్కలి డివిజన్లో 50 శాతం సరఫరా చేయడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలుస్తోంది. కూలిన విద్యుత్తు స్తంభాలను తొలగించి కొత్తవి వేయడంలో జరుగుతున్న జాప్యం ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఈపీడీసీఎల్ సీఎండీ హెచ్.వై.దొర, ట్రాన్స్‌కో సీఎండీ విజయానంద్, ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్‌తో పాటు ఉన్నతాధికారులంతా విద్యుత్తు సరఫరా పునరుద్ధరణ పనులపై దృష్టి కేంద్రీకరించి పనిచేస్తుండటంతో శనివారం సాయంత్రానికి పరిస్థితి చక్కదిద్దే అవకాశం ఉందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.