రాయచోటిలోని వైసీపీకి ముస్లింలు షాక్‌ ఇస్తారా అంటే నిజమేనంటున్నారు ముస్లిం వర్గాలు. పులివెందుల తర్వాత వైసీపీకి అత్యంత ఆదరణ ఉన్న నియోజకవర్గం రాయచోటి. ఇందుకు కారణం ముస్లిం ఆదరణ పార్టీకి ఉండడమే. వైసీపీ ఆవిర్భావం నుంచి వైసీపీకే నియోజకవర్గ ఓటర్లు నీరాజనం పలుకుతూ వస్తున్నారు. 2012 ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి గడికోట శ్రీకాంత్‌రెడ్డికి దాదాపు 60 వేలకు పైగా మెజార్టీ వచ్చింది. దీంతో ఒక్కసారిగా శ్రీకాంత్‌రెడ్డి పేరు రాష్ట్ర స్థాయిలో మారుమోగిపోయింది. అదేవిధంగా 2014 ఎన్నికల్లోనూ శ్రీకాంత్‌రెడ్డి సుమారు 40 వేల మెజార్టీతో గెలుపొందారు. ఫలితంగా రాష్ట్ర స్థాయిలో రాయచోటి నియోజకవర్గం అంటేనే.. వైసీపీ కంచుకోట అనే రీతిలో పేరు నిలిచిపోయింది. అయితే ఈసారి ఎన్నికల్లో ఇక్కడ వైసీపీకి ముస్లిం మైనార్టీల నుంచి షాక్‌ తప్పదని పలువురు పేర్కొంటున్నారు. ప్రతిసారి ఎన్నికల్లో తమను కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తున్నారని నియోజకవర్గంలోని ముస్లిం మైనార్టీలు ఆవేదన చెందుతున్నారు. తమకు రాజకీయంగా ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వకుండా అణచివేస్తున్నారని ఆగ్రహం చెందుతున్నారు. తమను కూరలో కరివేపాకులా చూస్తున్న వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డికి ఈసారి తమ సత్తా ఏంటో చూపిస్తామని యువకులు పేర్కొంటున్నారు. ఎన్నో ఏళ్లుగా వైసీపీకి అండగా ఉంటూ వస్తున్న ముస్లింల ఆగ్రహానికి కారణాలు ఒకసారి పరిశీలిస్తే..

thota 29102018 1

ఎమ్మెల్సీ ఇస్తామంటూ.. మొండిచేయి... నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఇక్కడ ముస్లింలు కాంగ్రెస్‌ పార్టీకి మద్దతుదారులుగా ఉన్నారని చెప్పవచ్చు. గతంలో రాయచోటి నియోజకవర్గంలో ఎన్నికల సమయంలో పెద్ద ఎత్తున ఘర్షణలు జరిగేవి. బాంబులు యథేచ్ఛగా వేసుకునే వారు. బూత్‌లు ఆక్రమించి రిగ్గింగులు జరిగేవి. ఈ పరిస్థితులలో ముస్లింలకు అండగా వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి నిలిచారు. దీంతో అప్పటి నుంచి కాంగ్రెస్‌ పార్టీతో సంబంధం లేకుండా ముస్లింలు వైఎస్‌ వెంట నడిచారు. అయితే ఆయన మరణానంతరం జరిగిన అనేక పరిణామాల నేపధ్యంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెంటే ముస్లింలు నడిచారు. 2012 ఉప ఎన్నిక సందర్భంగా వైఎస్‌ జగన్‌ సైతం రాయచోటి ముస్లింలకు ఎమ్మెల్సీ ఇస్తానని హామీ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో నియోజకవర్గ వ్యాప్తంగా ముస్లింల ఓట్లు గంపగుత్తగా వైసీపీకి పడ్డాయనే చెప్పవచ్చు. 2012 తర్వాత జిల్లాలో పలువురికి వైసీపీ ఎమ్మెల్సీ పదవులు ఇచ్చింది. అయితే రాయచోటి ముస్లింలకు మాత్రం ఆ కోరిక తీరలేదు. దీంతో ప్రస్తుతం పలువురు ముస్లిం మైనార్టీ నాయకులు తమ అసంతృప్తిని వెల్లగక్కుతున్నారు.

thota 29102018 1

దీంతో ముస్లింల మనోభావాలు దెబ్బతిన్నాయని గ్రహించిన వైసీపీ అధినాయకత్వం పలువురు మైనార్టీలను లోట్‌సఫాండ్‌కు పిలిపించి మాట్లాడినట్లు తెలిసింది. అయితే ఇక్కడ కూడా స్పష్పమైన హామీ ఇవ్వకుండా.. కేవలం కంటితుడుపు చర్యగానే మాట్లాడినట్లు మైనార్టీలు ఆవేదన చెందుతున్నారు. వైసీపీ అధినాయకత్వం వ్యవహార శైలితో మనోభావాలు దెబ్బతిన్న మైనార్టీలు ఈసారి ఎన్నికల్లో ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డికి షాక్‌ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని పలువురు పేర్కొంటున్నారు. దీంతోనే కాంగ్రెస్‌ పార్టీ తరపున పోటీలో ఉన్న ప్రముఖ బంగారు వ్యాపారి అల్లాబకాష్‌ను పలువురు మైనార్టీలు బలపరుస్తున్నట్లు తెలుస్తోంది. తమకు గౌరవం ఇచ్చే పార్టీకే అండగా ఉందామనే ఆలోచనలో మైనార్టీలు ఉన్నట్లు రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. మైనార్టీల మనోభావాలు దెబ్బతినడంతో.. ఈసారి శ్రీకాంత్‌రెడ్డి పరిస్థితి ఏంటో.. అని పలువురు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని చెప్పవచ్చు.

 

Advertisements

Advertisements

Latest Articles

Most Read