ఐఏయస్ అధికారి శ్రీలక్ష్మి. కొన్నేళ్లుగా తెలుగు ప్రజలకు సుపరిచితమైన పేరు. అత్యున్నత ప్రతిభతో అనతి కాలంలో పాలనా పరంగా మంచి పేరు తెచ్చుకున్నారు. జగన్ అక్రమాస్తుల కేసులో చాలా కాలం జైలు శిక్ష అనుభవించారు. ఆరోగ్య పరంగానూ ఇబ్బందులు పడ్డారు. అయితే, శ్రీలక్ష్మీ ఇప్పుడు ఏపీలో పని చేసేందుకు ఆసక్తిగా ఉన్నారు. జగన్‌ను ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి కలిశారు. తెలంగాణ కేడర్‌లో ఉన్న శ్రీలక్ష్మి ఆంధ్రప్రదేశ్‌కు పోవడం దాదాపు ఖరారైంది. ఆమె ఇప్పటికే జగన్‌తో మాట్లాడారని, ఏపీలో సేవలు అందించేందుకు అవకాశం కల్పించాలని కోరినట్లు సమాచారం. అందుకు ఆయన అంగీకరించారని... కీలకమైన శాఖను అప్పగిస్తానని హామీ కూడా ఇచ్చారని తెలిసింది.
శ్రీలక్ష్మి ఓబుళాపురం గనుల కుంభకోణం కేసులో జైలు పాలయ్యారు. జైల్లో అనారోగ్యానికి గురయ్యారు. ఆ తర్వాత నిర్దోషిగా బయటికి వచ్చాక ఐఏఎ్‌సగా కొనసాగుతున్నారు. రాష్ట్ర విభజన తర్వాత శ్రీలక్ష్మిని తెలంగాణ కేడర్‌కు కేటాయించారు. 1988 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన శ్రీలక్ష్మి అతి చిన్న వయస్సులో సివిల్ సర్వెంట్ అయ్యారు. ఆమె కెరీర్ ఒడిదుడుకుల్లేకుండా సాగితే కేంద్ర కేబినెట్ కార్యదర్శి స్థాయికి వెళ్లేవారు. ఓబుళాపురం గనుల అవినీతి కేసులు మెడకు చుట్టుకోవడంతో వృత్తిపరంగా అడుగు ముందుకు పడని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంలో పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ విభాగాన్ని పర్యవేక్షిస్తున్నారు.
జగన్ కేసుల్లో అనేక మంది అధికారులు జైలుకు వెళ్ళిన సంగతి తెలిసిందే. శ్రీలక్ష్మి తో సహా ఆధిత్య నాధ్ దాస్, శామ్యూల్, మన్మోహన్ సింగ్, ఎల్వీ సుబ్రమణ్యం, శ్యాంబాబు వంటి వారు ఉన్నారు. దీంతో..వీరిలో ఇప్పటికే శామ్యూల్ పదవీ విరమణ చేసి జగన్ ప్రభుత్వంలో సలహాదారుడిగా ఉండనున్నారు. ఇక, ఎల్వీ సుబ్రమణ్యం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. ఇప్పుడు శ్రీలక్ష్మీ కూడా జగన్ తో కలిసి పని చెయ్యనున్నారు. జగన్ టీం కోసం అటు అధికారులు కూడా రంగంలోకి దిగారు. ఇందు కోసం ఐఏయస్‌ల ఎంపిక ఎల్వీ సుబ్రమణ్యం..అజయ్ కళ్లాం పరిశీలిస్తుంటే..ఐపీఎస్‌ల వ్యవహారం సవాంగ్ పర్యవేక్షిస్తున్నారు.