‘జగన్ను చంపాలనే ఆలోచన నాకు లేదు. ఆయన్ని గాయపరిస్తే ప్రజల నుంచి సానుభూతి వస్తుంది. పార్టీకి లాభం జరుగుతుందని భావించే దాడి చేశా’ అని నిందితుడు శ్రీనివాసరావు పోలీసులకు చెప్పినట్లు తెలిసింది. ‘నాకు చాలా ఆలోచనలు ఉన్నాయి. వాటిని జగన్తో పంచుకొనే అవకాశం లభించలేదు. ఇప్పుడీ ఘటన ద్వారా నేను రాసిన లేఖతో వైసీపీ అధినేతకు అన్నీ అర్థమవుతాయి. నేను అనుకున్నది నెరవేరినట్లే’ అని కూడా చెప్పినట్లు సమాచారం. కాగా, జగన్పై విశాఖ విమానాశ్రయంలో కోడిపందేల కత్తితో దాడి చేసిన నిందితుడు శ్రీనివాసరావులో ఏ కోశానా భయం, ఆందోళన కనిపించడం లేదని అతడ్ని గురు, శుక్రవారాల్లో విచారించిన పోలీసులు అంటున్నారు.
ఎన్నిసార్లు ప్రశ్నించినా.. ‘నా వెనుక ఎవరూ లేరు. ఎవరూ ప్రేరేపించలేదు. బుద్ధిపూర్వకంగానే దాడి చేశా’ అని అతను వెల్లడించినట్లు చెబుతున్నారు. అయితే పోలీసులు మాత్రం అంత కరుడుగట్టిన వ్యక్తిత్వం శ్రీనివాస్ కు ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు రాబట్టేందుకు పోలీస్ కస్టడీ కోరుతూ శనివారం కోర్టులో పిటిషన్ వేశారు. నిందితుడు శ్రీనివాసరావును విచారించేందుకు కోర్టు 6 రోజులు అనుమతి ఇచ్చింది. నిందితుడు శ్రీనివాసరావు స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం ఠాణేలంకలోని ఆయన కుటుంబసభ్యులను మరోసారి విచారించారు.
శ్రీనివాసరావు ఇంట్లో లభించిన మూడు బ్యాంకు ఖాతా పుస్తకాలలోని లావాదేవీలపై ఆరా తీశారు. ఆ ఖాతాలకు పెద్దమొత్తంలో నగదు జమ అయినట్టు సిట్ అధికారులకు సమాచారం అందింది. అయితే, శనివారం బ్యాంకులకు సెలవు కావడంతో.. ఆ ఖాతాలను పరిశీలించే పనిని సోమవారానికి వాయిదా వేసుకొన్నారు. ఇప్పటికే అతని కుటుంబసభ్యులు, బంధువులతో సిట్ అధికారులు మాట్లాడారు. మరిన్ని వివరాల కోసం వారితో మరొకసారి మాట్లాడనున్నారు. లేక రాసిన రేవతి పతి, మరో యువతితోపాటు తాజాగా ఇంకో యువతిని కూడా సిట్ పోలీసులు విచారించారు. వారిచ్చిన సమాచారాన్ని కూడా శ్రీనివాసరావు చెప్పే వివరాలతో పోల్చనున్నారు. గత ఏడాది కాలంలో శ్రీనివాసరావు 9 ఫోన్లు ఎందుకు మార్చాడు? వాటిని కొనడానికి అవసరమైన నగదు ఎలా వచ్చింది? అతని ఆర్థిక వనరులు ఏంటి? అతనికి ఎన్ని బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నాయి? నగదు పరిస్థితి, ఇతర లావాదేవీలు ఏంటి? ఈ అంశాలపై సిట్ పోలీసులు శ్రీనివాసరావును ప్రశ్నించనున్నారు.