పార్టీల నుంచి టికెట్ ఆశించిన నేతలు చివరి నిమిషంలో టికెట్ దక్కకపోవడంతో ఆయా పార్టీలపై దుమ్మెత్తి పోస్తున్న పరిస్థితిని చూస్తున్నాం. రోజులు తిరగకుండానే ఇతర పార్టీల్లోకి చేరేందుకు సిద్ధపడుతున్నారు. అయితే ఓ టీడీపీ నేత మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరించారు. శ్రీశైలం నియోజకవర్గం నుంచి అభ్యర్థిగా బుడ్డా రాజేశేఖర్రెడ్డి పేరును టీడీపీ ఖరారు చేసింది. జాబితాలో కూడా ఆయన పేరును ప్రకటించింది. సోమవారం నుంచే నామినేషన్ల ప్రక్రియ కూడా కొనసాగుతోంది. అయితే ఇలాంటి సమయంలో రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటున్నానని బుడ్డా రాజశేఖరరెడ్డి చేసిన ప్రకటన కలకలం రేపింది. బుడ్డా తీసుకున్న ఈ నిర్ణయం కార్యకర్తలను విస్మయానికి గురిచేసింది.
టికెట్ ఖరారు తర్వాత ఇలాంటి నిర్ణయం తీసుకోవడం తప్పేనని, తనకు తెలుగుదేశం పార్టీ అన్ని అవకాశాలు కల్పించిందని చెప్పారు. కుటుంబ పరిస్థితుల వల్ల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని బుడ్డా తెలిపారు. అయితే బుడ్డా తప్పుకోవడంతో ఆయన అనుచరులు నిరాశకు గురవుతున్నారు. రాజశేఖర్రెడ్డి రాజకీయాల్లో కొనసాగాలని కార్యకర్తలు ముక్తకంఠంతో నినదిస్తున్నారు. రాజశేఖర్రెడ్డి నిర్ణయం తట్టుకోలేని ఓ కార్యకర్త ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. అయితే తన సోదరుడైన శేషారెడ్డికి శ్రీశైలం టికెట్ ఇవ్వాలని బుడ్డా రాజశేఖర్రెడ్డి సీఎం చంద్రబాబును కోరారు.
శ్రీశైలం నుంచి వైసీపీ టికెట్ ఆశించి భంగపడ్డ తన తమ్ముడు శేషారెడ్డికి టికెట్ ఇవ్వాలని కోరిన బుడ్డా తమ్ముడి కోసం సీటు త్యాగం చేసేందుకు కూడా సిద్ధపడ్డారు. అయితే, శ్రీశైలం నుంచి ఏవీ సుబ్బారెడ్డిని బరిలో దించాలని తెదేపా అధిష్ఠానం ప్రతిపాదించినట్టు సమాచారం. మహానంది, బండిఆత్మకూరు మండలాల్లో సుబ్బారెడ్డికి పట్టుంది. ఈ నేపథ్యంలో అధిష్ఠానం చేసిన ప్రతిపాదన పై ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని సుబ్బారెడ్డి చెప్పినట్టు తెలుస్తోంది. మరోవైపు, బుడ్డా రాజశేఖర్ రెడ్డి వైఖరిపై తెదేపా కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. వేల్పనూరులోని ఆయన నివాసం వద్ద నినాదాలు చేస్తున్నారు. రాజశేఖర్ రెడ్డి తన నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని ఆందోళనకు దిగారు.