కమల్‌హాసన్ కుమార్తె శృతిహాసన్‌ను వైసీపీ ఎంపీ అభ్యర్థి పీవీపీ(పొట్లూరి వర ప్రసాద్) బ్లాక్ మెయిల్ చేశారని టీడీపీ అభ్యర్థి కేశినేని నాని ఆరోపించారు. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేశినేని మీడియాతో మాట్లాడుతూ.. తన ప్రత్యర్థి పీవీపీపై సంచలన ఆరోపణలు చేశారు. ‘‘కమల్‌హాసన్ గారి అమ్మాయి శృతిహాసన్‌ను బ్లాక్‌మెయిల్ చేసి కాల్ షీట్లు తీసుకున్నారు. అలాగే చాలామంది హీరోయిన్లు ఏడిపించిన వ్యక్తి ఇతను. సినిమా ఇండస్ట్రీలో మహేశ్‌బాబును తప్ప ప్రతి హీరోనూ ఇతను మోసం చేశాడు. సినిమా ఇండస్ట్రీకి కూడా ఇతనంటే అసహ్యం పుట్టింది. ఒక్క మహేశ్ బాబే ఈయన చేతికి దొరకలేదు. హీరోయిన్లను ఏడిపించాడు.. డైరెక్టర్లను ఏడిపించాడు. అవసరం అయితే లీగల్ నోటీసులని చెప్పి బ్లాక్ మెయిల్ చేసి వాళ్ల డేట్లు తీసుకునేవాడు. ఇతను ఏదైనా చేయడానికి సిద్ధహస్తుడు. ఇతను ఒక క్రిమినల్.. ఇతనొక మోసగాడు.’’ అంటూ కేశినేని నాని ఆరోపించారు.
అంతేకాకుండా పీవీవీ ఆర్థికనేరగాడంటూ కేశినేని విమర్శించారు. ‘‘పీవీపీ నాకంటే ఐదేళ్లు చిన్నోడు. చిన్నప్పటి నుంచి ఇతనో నేరగాడు. అంతర్జాతీయ ఆర్థిక నేరగాళ్లను ప్రజలు విజయవాడలో అడుగు పెట్టనివ్వరు. హైదరాబాద్‌లో ఇతని సీన్ అయిపోయింది. కెనరాబ్యాంక్‌కు ఇతను రూ. 137 కోట్లు ఎగ్గొడితే మొన్న నోటీసులు ఇచ్చారు. ఇతను తాకట్టు పెట్టిన ఆస్తిని బ్యాంకు వాళ్లు వేలం వేస్తే ఏడు కోట్లు కూడా రాలేదు. మిగతా 130 కోట్లు ఎవరు కడతారు?. అలాగే ఇంకా చాలా స్కాములు చేశాడు. బొగ్గు స్కాము, జగతి పబ్లికేషన్స్‌లో రూ. 147 కోట్ల మనీల్యాండరింగ్, హవాలా కేసులు, అలాగే సెబీ కూడా రూ. 30 కోట్ల ఫైన్ వేసింది.’’ అంటూ కేశినేని నాని ఆరోపణలు చేశారు.
జగన్ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ-సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ప్రకారం... 74 మంది నిందితుల్లో పొట్లూరి వరప్రసాద్ 19వ నిందితుడు. జగన్ కు చెందిన జగతి పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్-జె.పి.పి.ఎల్ సంస్థల్లో రూ. 146.97 కోట్లు పెట్టుబడులు పెట్టారని ఆరోపణలున్నాయి. పీవీపీ వెంచర్స్ రూ. 55 కోట్లు, క్యూబిక్ రియల్టర్స్ రూ. 35 కోట్లు, మెటాఫర్ రియల్ ఎస్టేట్స్ అండ్ ప్రాజెక్ట్స్ రూ. 6 కోట్లు, పీవీపీ బిజినెస్ టవర్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.10 కోట్లు పెట్టుబడులు పెట్టారని అభియోగాలున్నాయి. వరప్రసాద్ కు పోటీగా తెలుగుదేశం తరఫున సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని బరిలో నిలిచారు. ఇద్దరూ కృష్ణా జిల్లాలో బలమైన సామాజిక వర్గానికి చెందిన నేతలే. ఇలాంటి పరిస్థితుల్లో విజయవాడ లోక్ సభ స్థానంలో పోటీ హోరా హోరీగా ఉంటుందని రాజకీయ పరిశీలకుల అభిప్రాయం.