బీజేపీ యేతర రాజకీయ పక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సాయంత్రం గన్నవరం విమానాశ్రయం నుంచి చెన్నై బయల్దేరి వెళ్లిన చంద్రబాబు నేరుగా స్టాలిన్ నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు డీఎంకే నేతలు ఘనస్వాగతం పలికారు. భాజపాయేతర పార్టీలను ఏకతాటిపైకి తీసుకురావడమే లక్ష్యంగా చంద్రబాబు చేస్తున్న కృషిని స్టాలిన్ ఇటీవల ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఆయనను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇటీవల దిల్లీ పర్యటనలో తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. అనంతరం ఆయన తన ప్రయత్నాన్ని మరింత ముమ్మరం చేశారు. వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల నాటికి భాజపా వ్యతిరేక పార్టీలను ఏకం చేయడమే లక్ష్యంగా వడివడిగా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా గురువారం బెంగళూరులో కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి, ఆయన తండ్రి, మాజీ ప్రధాని దేవేగౌడ, తదితర నేతలతో సమావేశమయ్యారు. ఇదే క్రమంలో ఈ రోజు చెన్నైకి బయల్దేరి వెళ్లారు. డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌తో గంట పాటు చర్చించారు.
సమావేశం అనంతరం స్టాలిన్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రాల హక్కులను మోదీ సర్కార్ కాలరాస్తోందని ఆరోపించారు. మతవాద బీజేపీని గద్దె దించేందుకే చర్చలు జరుపుతున్నామని, ఇప్పటికే రాహుల్‌ను చంద్రబాబు కలిశారని తెలిపారు. వివిధ పార్టీల నేతలను చంద్రబాబు కలవడం, ఆహ్వానించే పరిణామని స్టాలిన్ వ్యాఖ్యానించారు. చంద్రబాబు ప్రయత్నాలకు పూర్తిగా సహకరిస్తామని, ఢిల్లీ లేదా మరో నగరంలో అందరం కలుస్తామని స్టాలిన్ తెలిపారు. చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. దేశాన్ని రక్షించేందుకు సహకరించాలని స్టాలిన్‌ను కోరామని చెప్పారు. త్వరలో పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీతో సమావేశమవుతామన్నారు. స్వతంత్ర వ్యవస్థలను నిర్వీర్యం చేశారని, విపక్షాలను వేధించేందుకే ఈడీ, ఐటీలను వాడుతున్నారని దుయ్యబట్టారు. మోదీ చర్యలతో ఆర్థికవ్యవస్థ కుదేలైందని మండిపడ్డారు. నోట్ల రద్దు అపహాస్యమైందని, నల్లధనం తెల్లధనంగా మారిందని, బ్యాంకులపై ప్రజలకు నమ్మకం పోయిందని ఆయన చెప్పారు.