జాతీయస్థాయిలో భాజపాయేతర కూటమి ఏర్పాటుకుగాను విపక్షాలు చేస్తున్న ప్రయత్నం ఆదివారం ఒక రూపు తీసుకోనుంది. తమిళనాడు రాజధాని చెన్నైలో ద్రావిడ దిగ్గజ నేతల విగ్రహాల ఆవిష్కరణ, అనంతరం జరిగే బహిరంగ సభ ఇందుకు వేదిక కానుంది. నగరంలోని డీఎంకే ప్రధాన కార్యాలయం ఆవరణలో డీఎంకే వ్యవస్థాపకుడు అన్నాదురై, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి విగ్రహాలను నూతనంగా ఏర్పాటు చేశారు. వీటి ఆవిష్కరణ కార్యక్రమంలో ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ప్రస్తుత అధ్యక్షుడు రాహుల్‌గాంధీతోపాటు తెదేపా అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, పశ్చిమ్ బంగ సీఎం మమతా బెనర్జీ, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, పుదుచ్చేరి సీఎం నారాయణస్వామి సహా సీపీఐ, సీపీఎం తదితర పార్టీల జాతీయ నేతలు పాల్గొననున్నారు.
ఈ నెల 10న దిల్లీలో భాజపాయేతర పార్టీలు సమావేశం అయ్యాయి. మరుసటి రోజు వచ్చిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో మూడు చోట్ల కాంగ్రెస్ అధికారాన్ని చేజిక్కించుకోవడం తదితర పరిణామాలతో దిల్లీ సమావేశానికి హాజరు కాని బీఎస్పీ అధినేత్రి మాయావతి సైతం కాంగ్రెస్‌కు మద్దతు పలికారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌కు సానుకూల సంకేతాలు కూడా ఏర్పడ్డాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఆదివారం అన్నాదురై, కరుణానిధి విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమంలో జాతీయ నేతలు ఎవరెవరు పాల్గొంటారనేది సర్వత్రా చర్చనీయాంశమైంది.
2019 లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో ఆదివారం నాటి కార్యక్రమాలు భాజపాయేతర కూటమికి ఒక రూపం తీసుకురానున్నాయి. ఈ కూటమికి తెదేపా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు చొరవ తీసుకోవడం, దానికి అనుగుణంగా దిల్లీ సమావేశానికి స్పందన రావడం, రాష్ట్రాల ఎన్నికల ఫలితాల జోష్... ఇలా పరిణామాలన్నీ కూటమికి బలం చేకూరుస్తున్నాయి. లోక్‌సభ ఎన్నికలకు నాలుగైదు నెలలే సమయం ఉండటంతో వైఎంసీఏ మైదానంలో జరగనున్న సభలో కూటమి ఏర్పాటుపై మరింత స్పష్టత రానుంది. ఈ సభను ఒక విధంగా విపక్షాలు తమ బలం, ఐక్యతను చాటుకునేందుకు వేదికగా చేసుకోనున్నాయి.