చంద్రబాబుతో తన సమావేశం అద్భుతంగా జరిగిందని డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ ట్వీట్ చేశారు. కేంద్రంలోని నియంతృత్వ భాజపా ప్రభుత్వాన్ని గద్దెదించే ఏకైక లక్ష్యంతో లౌకిక శక్తులన్నీ కలసి ఏర్పాటు చేస్తున్న మహా కూటమికి తన సంపూర్ణ మద్దతు ప్రకటించినట్లు పేర్కొన్నారు. దేశ ప్రజాస్వామ్య సమగ్రతను భాజపా పూర్తిగా ధ్వంసం చేసిందని వ్యాఖ్యానించారు. ఇది స్టాలిన్ ట్వీట్ "Had a great meeting with @ncbn today. I extend my full support to a grand alliance of secular forces with the single goal of overthrowing a fascist BJP that has completely destroyed the inclusive nature of our democracy."
బీజేపీయేతర పార్టీలను ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నాల్లో భాగంగా.. గురువారం బెంగళూరులో జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ, ఆయన కుమారుడు, కర్ణాటక సీఎం కుమారస్వామితో భేటీ అయిన చంద్రబాబు శుక్రవారం రాత్రి చెన్నైలో స్టాలిన్‌తో సమావేశమయ్యారు. రాత్రి 7.20కి స్థానిక ఆళ్వారుపేటలోని స్టాలిన్ నివాసానికి చేరుకుని.. దాదాపు గంటపాటు చర్చలు జరిపారు. అనంతరం చంద్రబాబు, స్టాలిన్ కలిసి విలేకరులతో మాట్లాడారు. ముందుగా స్టాలిన్ మాట్లాడారు. ‘రాష్ట్రాల హక్కులను కాపాడేందుకు సమైక్య కూటమిని ఏర్పాటు చేయడానికి బాబు పూనుకోవడం హర్షణీయం. ఇదివరకే ఆయన ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో భేటీ అయ్యారు. ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్ని రాష్ట్రాల్లో భావసారూప్యం ఉన్న ప్రతిపక్షాలతో కలిసి బీజేపీని కూలదోయాలని నేను కూడా కోరుకుంటున్నాను.
మోదీ ప్రభుత్వం న్యాయవ్యవస్థను, సీబీఐ, ఆర్బీఐలను స్వతంత్రంగా పనిచేయనివ్వడం లేదు. వాటిని బెదిరించి నిర్వీర్యం చేస్తోంది’ అని ఆరోపించారు. ఎన్డీఏకి వ్యతిరేకంగా పోరాడేందుకు అన్ని రాష్ట్రాలకు చెందిన పార్టీల నాయకులు, ముఖ్యమంత్రులు కలిసికట్టుగా పనిచేయాల్సి ఉందన్నారు. ఇందుకోసం చంద్రబాబు డీఎంకే మద్దతు కోరారని, తాము సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు చెప్పామన్నారు. త్వరలో ఓ ఐక్య వేదిక సభను నిర్వహిస్తామని ఆయన చెప్పారని, ఆ సభకు తాము కూడా వెళ్తామని, ఆయనతో కలిసి నడుస్తామని పేర్కొన్నారు. కనీస ఉమ్మడి కార్యక్రమంతో కూటమి ఏర్పాటు కావడం తథ్యమన్నారు. కరుణానిధి కూడా మతవాద వ్యతిరేక కూటమి ఉండాలని గట్టిగా కోరుకునేవారని స్టాలిన్ పేర్కొన్నారు.