రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా రేపు మోగనుంది. ఈ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ విస్తృతంగా సంప్రదింపులు జరిపింది. ఎన్నికల షెడ్యూలు శనివారం విడుదల చేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్‌కుమార్ ప్రకటించారు. రేపు నోటిఫికేషన్, షెడ్యూలు వెనువెంటనే విడుదల చేస్తామని తెలిపారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాకే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని రమేష్‌కుమార్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొత్త ఓటర్లు నమోదు ఇంకా సాధ్యం కాదని చెప్పారు. ఎన్నికలు జరగటానికి, ప్రభుత్వ ఉద్యోగులు సరిపోతారని, సరిపోక పొతే, అప్పుడు చూద్దామని, అయితే వాలంటీర్లను వాడుకోవద్దు అంటూ రాజకీయ పార్టీలు చెప్పయని చెప్పారు. ఎన్నికల్లో డబ్బు, మద్యం పంచి పెడితే, కొత్త చట్టం ప్రకారం చర్యలు ఉంటాయని చెప్పారు. ఈ సందర్భంలో, ఒక విలేకరి మాట్లాడుతూ, పంచాయతీ భవనాలకు, ప్రభుత్వ భవనాలకు వైసీపీ రంగులు ఉన్నాయి అంటూ, ప్రతిపక్షాలు గొడవ చేస్తున్నాయి కదా, దీని పై ఏమి చేస్తారు అని ప్రశ్నించారు.
ఆ ప్రశ్న పై సమాధానం చెప్తూ, ఇప్పుడు ఆ విషయం పై మేము ఏమి చెప్పలేం అని, ఎన్నికల కోడ్ వచ్చాక స్పందిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్‌కుమార్ అన్నారు. ఇక అంతకు ముందు, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ పార్టీల అభిప్రాయాలు సేకరించింది. విజయవాడలోని ఈసీ కార్యాలయంలో ఆయా పక్షాల నేతలతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్ భేటీ అయ్యారు. వైకాపా తరఫున శాసనసభ్యులు జోగి రమేశ్, అనిల్, తెదేపా నుంచి నేతలు వర్ల రామయ్య, ఆలపాటి రాజా హాజరయ్యారు. జనసేన నుంచి వెంకటమహేశ్, భాజపా నుంచి నాగభూషణం, వామపక్షాల తరఫున వై.వీ.రావు, జెల్లి విల్సన్ హాజరయ్యారు. కలెక్టర్లు, ఎస్పీలు, రాజకీయ పార్టీల నేతలతో చర్చించింది.
విడతల వారీగా ఎన్నికల నిర్వహణ, సిబ్బంది, బందోబస్తుపై చర్చించామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్‌కుమార్ తెలిపారు. రాజకీయ పార్టీల అభిప్రాయాలు తీసుకున్నామన్న ఆయన పరీక్షలకు ఇబ్బంది లేకుండా ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. ఎన్నికల నిర్వహణపై ప్రమాణ పత్రం దాఖలు చేశామని తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తిపై పార్టీలు తమ దృష్టికి తీసుకువచ్చాయని తెలిపారు. ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. ఈసారి స్థానిక సంస్థల ఎన్నికలకు ఈవీఎంలను పక్కన పెట్టామని తెలిపారు. ఈవీఎంలపై నిరాసక్తత వ్యక్తం చేస్తున్నందున ఏ ఒక్కరూ అడగలేదని అన్నారు. ఎన్నికల షెడ్యూలు శనివారం విడుదల చేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్‌కుమార్ ప్రకటించారు.