దేశంలో ఒకో రాష్ట్రానికి ఒకో ప్రత్యేకత సంతరించున్న నేపధ్యాలు ఉన్నాయి. తూర్పుతీరంలో విస్తారమైన తీరప్రాంతమున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కు సొంతం. తూర్పుతీరంలో మధ్యలో ఉన్న ఆంధ్రప్రదేశ్ లో తొలిగా సూర్యుడు ఉదయిస్తాడు. తదుపరి మిగిలిన రాష్ట్రాల్లో సూర్యుడు కిరణాలు ప్రసరిస్తాయి. ఈనేపథ్యంలో ఏపీకి అంబాసిడర్ సూర్యుడు అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించడం విశేషం. ఏపీకి 'సన్ రైజ్ స్టేట్ ' (సూర్యోదయ రాష్ట్రం ) గా గుర్తింపు సాధించేందుకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారు. సూర్యారాధన ప్రాధాన్యాన్ని, సూర్యోదయ రాష్ట్రంగా గుర్తింపును విస్తృత పరచాలనుకుంటున్న ఏపీప్రభుత్వం నిర్ణయించింది.
ప్రకృతి ఆరాధనతో రాష్ట్రానికి, ప్రజలకు మంచి జరుగుతోందని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం... ఆదివారం ‘సూర్య నమస్కారం’ కార్యక్రమాన్ని చేపట్టింది. మతాలకు అతీతంగా రాష్ట్ర ప్రజలంతా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం 7 గంటలకు విజయవాడ మునిసిపల్ గ్రౌండ్‌లో ముఖ్యమంత్రి పాల్గొని ‘సూర్య వందనం’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సూర్యుడు జస్టిస్ చక్రవర్తిలాంటి వాడని సీఎం అభివర్ణించారు... బీద, ధనిక తారతమ్యాలు లేకుండా సూర్యుడు అందరికీ వెలుగులు ఇస్తాడని అన్నారు. అలుపెరుగకుండా ప్రపంచమంతా క్రమశిక్షణతో వెలుగులు పంచే బాధ్యతను నిర్వర్తించే సూర్యునికి రోజూ నమస్కారం చేస్తే చాలా మంచిదని, డి-విటమిన్ వస్తుందని అన్నారు.
అరబ్ దేశాల్లో సూర్యుడ్ని షమ్స్ అనే పేరుతో ఆరాధిస్తారని, అటు క్రైస్తవులూ బైబిల్‌లో ప్రాధాన్యత ఇచ్చారని ముఖ్యమంత్రి తెలిపారు. సర్వజనీన నిత్యచైతన్య శక్తిగా ఉన్న సూర్యుడిని ఆరాధిస్తే ఆరోగ్యంగా, మానసికంగా వృద్ధిని సాధిస్తామని పేర్కొన్నారు. చైతన్యమూర్తి అయిన సూర్యుడిని ఆరాధిస్తే మనం నిత్య ప్రేరణ పొందొచ్చవచ్చని అన్నారు సూర్యుడు జస్టిస్ చక్రవర్తి లాంటివాడని. పేదా.. గొప్పా అనే వ్యత్యాసం లేకుండా అందరిని సమానంగానే చూస్తాడని పేర్కొన్నారు. 460 కోట్ల సంవత్సరాల వయసున్న సూర్యుడు నుంచి మనం రోజూ శక్తిని పొందుతూనే ఉన్నామన్నారు. ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకుని ముందుకు వెళ్ళాలని.. ప్రకృతిని, సాంకేతికతను సమన్వయం చేసుకోవాలన్నారు. ఈ రెండూ మానవ మనుగడకు అవసరమేనని అన్నారు. సూర్యారాధన ఏ మతానికి సంబంధించిన అంశం కాదని... దీనిపై కొందరు లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో సౌరశక్తితోనే 5 వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి చేస్తున్నామని ముఖ్యమంత్రి వెల్లడించారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో ప్రపంచంలోనే ఎక్కడా లేనివిధంగా 1000 మెగావాట్లు సౌర విద్యుత్ ఉత్పత్తి అవుతోందని తెలిపారు. అనంతరం సూర్యభగవానుడికి ఆర్ఘ్యం ఇచ్చి సూర్యారాధన కార్యక్రమాన్ని సీఎం ఆరంభించారు. హిందూ, ముస్లిం, క్రైస్తవ ఆచారాలను అనుసరించి ప్రార్ధనలు నిర్వహించారు.సూర్యారాధన కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు, విద్యార్ధులు హాజరై 12 రకాల ఆసనాలతో సూర్యారాధన చేశారు.