కోడ్ ఉల్లంఘనకు సంబంధించి క్లీన్చిట్లపై తన అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోలేదని అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఎన్నికల సంఘం సభ్యుల్లో ఒకరైన అశోక్ లావాసా రాసినట్టు చెబుతున్న లేఖపై కేంద్ర ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా స్పందించారు. భిన్నాభిప్రాయాలనేవి కొత్తేమీ కాదని, గతంలోనూ ఇలాంటివి చోటుచేసుకున్నాయని అన్నారు. ఈమేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ, ఈసీలోని ముగ్గురు సభ్యుల ఆలోచనలు, సారూప్యతలు ఒకలా ఉండాలని అనుకోరాదని, గతంలోనూ ఇలాంటివి జరిగాయని అన్నారు. భిన్నాభిప్రాయాలు ఎప్పుడూ ఉన్నాయని, ఉంటాయని ఆయన అన్నారు. వీటిని పదవీ విరమణ తర్వాత తాము రాసిన పుస్తకాల్లో ఈసీఐలు, సీఈసీలు పేర్కొన్న సంబర్భాలు లేకపోలేదని అన్నారు.
తాను సైతం అవసరమైన సందర్భాల్లో బహిరంగ చర్చకు వెనుకాడనని, అయితే ప్రతీ దానికి ఓ సమయం అంటూ ఉంటుందని అరోరా ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తున్నారంటూ ప్రధాని నరేంద్ర మోదీ, భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్ షాలపై కాంగ్రెస్ ఫిర్యాదు చేసిన అంశంలో ఈసీ క్లీన్చిట్ ఇచ్చిన విషయంలో లావాసా అసంతృప్తితో ఉన్నారు. దీనిపై ఆయన ఈనెల 4న కేంద్ర ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరాకు లేఖ రాశారు. క్లీన్ చిట్ ఇచ్చే సమయంలో తన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవడం లేదని, మైనారిటీ నిర్ణయాలకు ప్రాధాన్యం దక్కడం లేదని ఆయన ఆరోపించారు. ఈసీ ఆదేశాల్లో మైనారిటీ నిర్ణయాలనూ జత చేయాలని లేఖలో పేర్కొన్నారు.
అరోరా, మరో సభ్యుడు సుశీల్ చంద్ర తీసుకుంటున్న నిర్ణయాలతో తాను బలవంతంగా సమావేశాలకు దూరంగా ఉండాల్సివస్తోందని కూడా లావాసా తన సన్నిహితులతో వాపోయినట్టు తెలుస్తోంది. నేతలకు క్లీన్ చిట్ ఇచ్చే సమయంలో తన వాదనను రికార్డు చేయలేదంటూ సీఈసీ అరోరాకు లావాసా లేఖ రాశారు. మైనారిటీ అభిప్రాయాలను కూడా రికార్డు చేయాలని లేఖలో లావాసా పేర్కొన్నారు. అయితే మెజారిటీ అభిప్రాయాలను మాత్రమే రికార్డు చేస్తామని ఎన్నికల సంఘం అంటోంది. దీంతో ఎన్నికల సంఘం పనితీరుపై ఎన్నికల కమిషనర్ లావాసా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. లావాసా లేఖతో ఎన్నికల సంఘం ఇరుకున పడినట్లు తెలుస్తోంది. ఇప్పటికే సీబీఐ, సుప్రీంకోర్టు లాంటి స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న సంస్థల్లో అంతర్గత కలహాలు తలెత్తగా ఇప్పుడు ఎన్నికల సంఘంలో కూడా అలాంటి పరిణామాలు కనిపిస్తున్నాయి.