భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్‌ని కుట్రపూరితంగా లైంగిక వేధింపుల కేసులో ఇరికిస్తున్నారంటూ వచ్చిన ఆరోపణలు, న్యాయవ్యవస్థలో అక్రమాలపై సుప్రీంకోర్టు ముమ్మర విచారణకు ఉపక్రమించింది. ఈ వ్యవహారాన్ని పరిశీలించాలంటూ సీబీఐ డైరెక్టర్, ఢిల్లీ పోలీస్ కమిషనర్‌తో పాటు ఇంటిలిజెన్స్ బ్యూరో చీఫ్‌కి సమన్లు జారీ చేసింది. దీనిపై చర్చించేందుకు ఈ మూడు సంస్థలకు చెందిన చీఫ్‌లు ఇవాళ మధ్యాహ్నం న్యాయమూర్తుల చాంబర్‌కు రావాలని జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఆదేశించింది. చర్చల అనంతరం మళ్లీ తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు ధర్మాసనం తదుపరి ఆదేశాలను జారీ చేయనుంది. సుప్రీం సీజే జస్టిస్ రంజన్ గొగోయ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ వ్యవహారంపై సుమోటోగా తీసుకుని విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే.
‘దళారి’ రోమేశ్ శర్మ నిర్వహిస్తున్న ‘క్యాష్ ఫర్ జడ్జిమెంట్’ (డబ్బులు తీసుకుని తీర్పు చెప్పడం) దందాకు చెక్ పెట్టినందుకే జస్టిస్ గొగోయ్‌ని తప్పుడు కేసులో ఇరికించేందుకు కుట్ర జరుగుతోందంటూ ఉత్సవ్ బైంసా అనే లాయర్ ఆరోపించారు. దీనికి సంబంధించిన ఆధారాలు కూడా తన వద్ద ఉన్నాయంటూ ఆయన పేర్కొనడంతో.. బుధవారం వాటిని సీల్డ్ కవర్‌లో తమ ముందు ఉంచాలని సుప్రీం ఆయనకు సమన్లు పంపింది. సీజేని ఇరికించేందుకు సాయం చేయాలంటూ లంచం ఇవ్వజూపినట్టు తన వద్ద సీసీటీవీ ఫూటేజిలు కూడా ఉన్నాయని బైంసా నివేదించారు. ఈ మేరకు లాయర్ బైంసా సుప్రీంకోర్టు సమర్పించిన అఫిడవిట్‌లో జెట్ ఎయిర్‌వేస్ నరేశ్ గోయల్ పేరుకూడా ఉంది. లంచం తీసుకుని తనకు అనుకూలంగా తీర్పు చెప్పించుకునేందుకు ప్రయత్నించి ఆయన విఫలమైనట్టు ఆయన ఆరోపించారు.
ఈ ఆరోపణలు చాలా ‘‘కలవరపాటుకు’’ గురిచేస్తున్నాయనీ... మూలాలతో సహా ఈ వ్యవహారాన్ని నిగ్గుతేల్చాలని జస్టిస్ మిశ్రా పేర్కొన్నారు. ‘‘న్యాయవ్యవస్థను రిమోట్‌తో నియంత్రించగలిగేలా.. దాని స్వతంత్ర విషయంలో పెను సమస్యలు తలెత్తుతున్నాయి. ఇదే నిజమైతే... ఇంతకు మించిన దారుణం మరోటి ఉండదు..’’ అని ఆయన వ్యాఖ్యానించారు. కాగా తనపై వచ్చిన ఆరోపణలపై అంతర్గత విచారణకు సైతం జస్టిస్ గొగోయ్ మార్గం సుగమం చేయడంపై జస్టిస్ మిశ్రా ప్రశంసలు కురిపించారు. ‘‘ఒక భారత ప్రధాన న్యాయమూర్తి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఇదే తొలిసారి. ఈ నిర్ణయం తీసుకునే సాహసం ఏ సీజేఐ చేయలేదు. ఒకవేళ ఏదైనా కుట్ర జరిగితే మాత్రం... అత్యంత సీరియస్‌గా తీసుకోవాల్సి ఉంటుంది. న్యాయవ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయాలని సీజేఐ భావిస్తున్నారు...’’ అని ఆయన పేర్కొన్నారు.