ఆంధ్రప్రదేశ్ విభజనపై కేంద్రం హామీల అమలుపై సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్ సోమవారం విచారణకు వచ్చింది. విభజన హామీల అమలుకు ఆదేశాలు ఇవ్వాలంటూ గతంలో తెలంగాణ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ విషయం పై, ఈ రోజు సుప్రీం కోర్ట్ విచారణ జరిపింది... నాలుగేళ్లుగా విభజన చట్టం ఎందుకు అమలు చేయలేదని కేంద్ర ప్రభుత్వాన్ని జస్టిస్ సిక్రీ ధర్మాసనం ప్రశ్నించింది. విచారణకు స్వీకరించిన సుప్రీం కోర్టు నాలుగు వారాల్లో వివరణ ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది. నాలుగు వారాలు గడువు కావాలని కేంద్ర ప్రభుత్వం కోరడంతో సుప్రీం కోర్టు విచారణను వాయిదా వేసింది.
అయితే ఈ రోజు న్యాయస్ధానం జారీ చేసిన నోటీసులకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల తరఫున న్యాయవాదులు హాజరైనా కేంద్రం స్పందించలేదు. దీంతో సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే దీనిపై నాలుగు వారాల్లో వివరణ ఇస్తామని అడిషనల్ సొలిసిటర్ జనరల్ మణిందర్ సింగ్ ధర్మాసనాన్ని కోరారు. దీంతో ఈ పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు నాలుగు వారాలకు వాయిదా వేసింది.
మరో పక్క, పార్లమెంట్ లో వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది... సభ మొదలవగానే అన్నాడీఎంకే సభ్యులు వెల్‌లోకి దూసుకొచ్చి నినాదాలు చేశారు. కావేరి జలాల వివాద పరిష్కారానికి బోర్డును ఏర్పాటు చేయాలని అన్నాడీఎంకే నిరసన వ్యక్తం చేశారు. సభ్యుల నిరసనల మధ్యే సభను నడిపించేందుకు స్పీకర్ సుమిత్రామహాజన్ యత్నించారు. దీంతో అన్నాడీఎంకే సభ్యులు పెద్దఎత్తున నినాదాలు చేశారు. అవిశ్వాస తీర్మానంపై పలు పార్టీలు ఇచ్చిన నోటీసులు అందాయని స్పీకర్ ప్రకటించారు. సభ సజావుగా సాగితే అవిశ్వాసంపై చర్చ చేపట్టవచ్చన్నారు. ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉందని సభ్యులు ఆందోళన విరమించాలని స్పీకర్ కోరారు. అయినప్పటికీ సభ్యులు వెనక్కి తగ్గకపోవడంతో స్పీకర్ సభను రేపటి(మంగళవారం)కి వాయిదా వేశారు.