బీజేపీ రథయాత్రకు అనుమతి నిరాకరిస్తూ కోల్కతా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ వేసిన బీజేపీకి చుక్కెదురైంది. ఈ పిటిషన్పై అత్యవసర విచారణ అవసరం లేదని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. సాధారణ కేసులలాగానే దీనిని పరిగణించనున్నట్లు స్పష్టం చేసింది. ఈ అంశం పూర్వాపరాలను పరిశీలిస్తే.. అమిత్ షా నేతృత్వంలో బీజేపీ తలపెట్టిన రథయాత్రకు పశ్చిమబెంగాల్ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ బీజేపీ కోల్కతా హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు సింగిల్ బెంచ్ ధర్మాసనం రథయాత్రకు అనుమతినిస్తూ తీర్పు ఇచ్చింది.
సింగిల్ బెంచ్ తీర్పుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ టీఎంసీ కోల్కతా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కోల్కతా చీఫ్ జస్టిస్ అనుమతిని నిరాకరిస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో చీఫ్ జస్టిస్ తీర్పును సవాల్ చేస్తూ బీజేపీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అత్యవసరంగా విచారించాలని కోరింది. కానీ.. సాధారణ పిటిషన్లను విచారించిన మాదిరిగానే ఈ పిటిషన్ను విచారిస్తామని, అత్యవసర విచారణ అవసరం లేదని దేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. రాబోయే లోక్సభ ఎన్నికలే లక్ష్యంగా ‘సేవ్ డెమోక్రసీ ర్యాలీ’ పేరుతో పశ్చిమబెంగాల్లోని 42 పార్లమెంట్ నియోజకవర్గాల్లో రథయాత్రలు నిర్వహించాలని బీజేపీ భావిస్తోంది.
సమస్యలు సృష్టిస్తుందన్న అనుమానంతో తృణమూల్ కాంగ్రెస్ భాజపా రథయాత్రను అడ్డుకుంటుదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ విమర్శించారు. డిసెంబరు 28 నుంచి 31 మధ్యలో ఈ రథయాత్రను నిర్వహించేలా భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మరోసారి షెడ్యూల్ మార్చారు. 2019 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని 42 లోక్సభ నియోజవర్గాల్లో ప్రచారం నిర్వహించాలన్న భాజపా ప్రణాళికకు డివిజనల్ బెంచ్ ఆదేశాలతో అడ్డంకి ఏర్పడింది. గతంలో ఏకసభ్య ధర్మాసనం రథయాత్రకు అనుమతినిస్తూ ఇచ్చిన తీర్పును కలకత్తా హైకోర్టు డివిజనల్ బెంచ్ పక్కన పెట్టింది. ఆ నేపథ్యంలో దాన్ని సవాలు చేస్తూ భాజపా సుప్రీంను ఆశ్రయించింది.