జగన్ మోహన్ రెడ్డి మొన్న జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. భారీగా సీట్లు గెలుచుకున్నారు. 151 సీట్లు గెలుచుకుని, తిరుగులేని శక్తిగా వచ్చారు. అయితే ఇదంతా మూడు నాళ్ళ ముచ్చట గానే మిగిలిపోయింది. 151 మంది ఉన్నా, రాష్ట్రానికి మాత్రం చేసింది ఏమి లేదు. గత ఏడు నెలలుగా రాష్ట్రం దిగజారి పోతుంది. ఇప్పటి వరకు ఒక్క పెట్టుబడి లేదు. ఉన్న కంపెనీలు వెళ్ళిపోతున్నాయి. రాష్ట్రానికి ఆదాయం రోజు రోజుకీ దిగజారిపోతుంది. అప్పులతో నెట్టుకు వచ్చే పరిస్థితి వచ్చింది. పరిపాలన ఇలా ఉంటే, సమస్యలు కూడా అలాగే ఉన్నాయి. ముఖ్యంగా ఇసుక లేదు, దాదాపుగా అయుదు నెలల పాటు, భవన నిర్మాణ కార్మికులు ఎలా ఇబ్బంది పడ్డారో చూసాం. తరువాత, ఒక నెల రోజుల పాటు కరెంటు కష్టాలు వచ్చాయి. ఇక రైతుల సమస్యలు అయితే చెప్పే పనే లేదు. విత్తనాలు ఇవ్వలేక ఎలా ఇబ్బంది పడ్డారో చూసాం. ఇప్పుడు సంక్రాంతి పండుగ వేళ, గిట్టు బాటు ధర లేక, పంట కొనక, తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలా ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కుంటున్న వేళ, మరో సమస్య వచ్చి పడింది.
సమస్య వచ్చి పడింది అనే కంటే, సమస్యను కావాలనే సృష్టించారని చెప్పచ్చు. అదే మూడు రాజధానులు. 13 జిల్లాల రాష్ట్రానికి, మూడు రాజధానులు ఏమిటో ఎవరికీ అర్ధం కాలేదు. అప్పటి నుంచి గత 29 రోజులుగా ప్రతి రోజు ఆందోళనలు. మహిళలను కొడుతున్న తీరు అయితే, వర్ణణాతీతం. ఇలా సమస్యల సుడిగుండంలో రాష్ట్రం చుట్టుకుంది. అన్ని వర్గాల ప్రజలకు ఏదో ఒక ఇబ్బంది. అయితే, ఇదే సమయంలో, ప్రభుత్వానికి, హైకోర్ట్ నుంచి, స్థానిక ఎన్నికలు జరపాలి అనే ఆదేశాలు వచ్చాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం, క్యాబినెట్ మీటింగ్ పెట్టి, 59.85 శాతం రిజర్వేషన్ ను డిసైడ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. అయితే, ఇక్కడే అందరినీ ఆశ్చర్య పరిచింది. ఎందుకంటే, సుప్రీం కోర్ట్ మార్గదర్శకాల ప్రకారం రిజర్వేషన్లు 50 శాతం దాటకుండా చూడాలి.
మరి ఆ మార్గదర్శకాలు పట్టించు కోకుండా ఎందుకు ఈ ఉత్తర్వులు ఇచ్చారు ? అనే చర్చ జరిగినప్పుడు, వైసీపీ ప్రభుత్వం కావాలనే ఇలా చేసిందా అనే చర్చ జరిగింది. ఎవరైనా కోర్ట్ కు వెళ్తే, 59.85 శాతం రిజర్వేషన్ పై కచ్చితంగా స్టే వస్తుంది కాబట్టి, ఇప్పుడున్న ప్రజా వ్యతిరేకత నుంచి తప్పించుకుని, మరి కొంత కాలం ఎన్నికలు లేకుండా చూడాలని, ప్రభుత్వం ఎత్తుగడ. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం అనుకున్నట్టే జరిగిందని అనుకోవాలి. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల జీవో పై, ఈ రోజు సుప్రీం కోర్టు స్టే ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లను 50శాతం మించకుండా చూడాలంటూ బిర్రు ప్రతాప్‌రెడ్డి, బీసీ రామాంజనేయులు వేర్వేరుగా సుప్రీంకోర్టులో పిటిషన్లను దాఖలు చేశారు. దీనిపై ఈ రోజు విచారణ చేపట్టిన కోర్టు స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టులో ఉన్న పిటిషన్‌పై వెంటనే విచారణ జరపాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో వైసీపీ ఊపిరి పీల్చుకుందనే చెప్పాలి. ఇదంతా తేలే సరికి, ఎంత లేదు అనుకున్నా, మరో 3 నుంచి 6 నెలలు వాయిదా పడే అవకాసం ఉంది. దీంతో, ప్రజా ఆగ్రహం నుంచి ప్రస్తుతానికి, వైసీపీ ప్రభుత్వం తప్పించుకుంది.