పోలవరం కేసు కీలక మలుపు తిరిగింది. ముంపు ప్రాంతాల్లో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని కేంద్రాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశాలోని పోలవరం ముంపు ప్రాంతాల్లో స్వతంత్ర సంస్థతో ప్రజాభిప్రాయ సేకరణ జరగాలని స్పష్టంచేసింది. ఈ మేరకు చర్యలు తీసుకుంటామని అఫిడవిట్‌లో పేర్కొనాలని కేంద్రానికి సూచించింది. ప్రజాభిప్రాయానికి సంబంధించిన విధివిధానాలేంటో పేర్కొంటూ అఫిడవిట్ దాఖలుచేయాలని ఆదేశించింది. పోలవరం నిర్మాణం పై అభ్యంతరం వ్యక్తంచేస్తూ ఒడిశా దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం విచారణ జరిపిన జస్టిస్ మదన్ బి లోకూర్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
మరో పక్క, మొన్న సోమవారం నాటికి, ప్రాజెక్టు పనులు 61.93 శాతం మేర పూర్తయ్యాయి. తవ్వకం పనులు 81 శాతం, కాంక్రీటు పనులు 48.55 శాతం, కుడి కాలువ పనులు 90 శాతం, ఎడమ కాలువ పనులు 65.54 శాతం, రేడియల్ గేట్ ల పనులు 61.94 శాతం పూర్తయ్యాయి. గతవారం స్పిల్‌వే పైలట్ చానల్ అప్రోచ్ ఛానల్, లెఫ్ట్ ఫ్లాంక్‌కు సంబంధించి 5.11 లక్షల క్యూబిక్ మీటర్ల మేర తవ్వకం పనులు జరిగాయి. స్పిల్‌వే, స్పిల్ చానల్, స్టిల్లింగ్ బేసిన్‌కు సంబంధించి 60 వేల క్యూబిక్ మీటర్ల వరకూ కాంక్రీటు పనులు పూర్తయ్యాయి. కాఫర్ డ్యాం పనులు 50,000 క్యూబిక్ మీటర్ల మేర జరిగాయి. పోలవరం పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం వ్యయం చేసిన మొత్తంలో కేంద్రం ఇంకా రూ.3,162.32 కోట్లను రీయింబర్స్ చేయాల్సి ఉంది. ఇప్పటిదాకా ప్రాజెక్టుపై రూ.15,025.45 కోట్లు ఖర్చు చెయ్యగా,.. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాక రూ.9,889.59 కోట్లు ఖర్చు అయ్యింది. ఇందులో ఇంకా 3162.32 కోట్లు కేంద్రం నుంచి రావాల్సి ఉంది.
ఇది ఇలా ఉంటే, పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర జలవనరులశాఖ ప్రశ్నల వర్షం కురిపిస్తూనే ఉంది. 2017 ఆగస్ట్టులో సమర్పించిన సవరించిన అంచనాలను 14 నెలలుగా నాన్చుతూనే ఉంది. కేంద్ర మంత్రి గడ్కరీ ఈ ఏడాది జులైలో స్వయానా పోలవరం ప్రాజెక్టును సందర్శించి ఇక అంతా తాను చూసుకుంటానని ఇచ్చిన అభయం కార్యరూపం దాల్చలేదు. ఆంధ్రప్రదేశ్ అధికారులు దిల్లీకొస్తే పది రోజుల్లో అంతా తేల్చేస్తామని చెప్పిన మాట నిలబెట్టుకోలేదు. 2014నాటి ధరల ప్రకారం సవరించిన అంచనాలకు కేంద్రం ఆమోదముద్ర వేస్తేనే ప్రాజెక్టు ముందుకు కదులుతుందన్న వాస్తవం తెలిసీ దిల్లీ పెద్దలు తాత్సారం చేస్తున్నారు. విడతల వారీగా కేంద్ర ప్రభుత్వ అధికారులు, నిపుణులు వచ్చి వెళ్లారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులను కళ్లారా చూశారు. వచ్చినవాళ్లంతా ఏదో కొత్త సమాచారం అడగడం, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం ప్రహసనంగా మారిపోయింది. తాజాగా 63వేల పేజీల సమాచారం అందించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఏదో మెలిక పెడుతూనే ఉంది.