ఇష్టం వచ్చినట్టు, స్వతంత్రంగా పని చేస్తున్న వ్యవస్థల్లో, తలదూర్చి, వ్యవస్థలను నాశనం చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి, ఈ రోజు సుప్రీంలో షాక్ తగిలింది. బీఐ కేసులో కేంద్రం నిర్ణయాన్ని సుప్రీం కోర్టు తప్పుబట్టింది. అలోక్ వర్మను సెలవుపై పంపుతూ కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్‌ను అత్యున్నత ధర్మాసనం కొట్టివేసింది. అలోక్ వర్మకు సీబీఐ డైరెక్టర్‌గా మళ్లీ బాధ్యతలు అప్పగించాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. కేంద్రప్రభుత్వం తనను బలవంతంగా సెలవుపై పంపించడాన్ని సవాలు చేస్తూ సీబీఐ డైరెక్టర్ ఆలోక్ కుమార్ వర్మ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. సీబీఐ కేసులో కేంద్రం వ్యవహరించిన తీరును సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ఈ వ్యవహారంలో సీవీసీ, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను సర్వోన్నతన్యాయస్థానం పక్కనబెట్టింది.
ఆలోక్‌వర్మకు తిరిగి బాధ్యతలను అప్పగించాలని కోర్టు ఆదేశించింది. ఈ అంశంపై ప్రధాని, ప్రతిపక్ష నేత, ప్రధాన న్యాయమూర్తి వారంలో నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. ఈ సమయంలో ఆలోక్ వర్మ విధానపరమైన, ప్రధాన నిర్ణయాలు తీసుకోవద్దని సూచించింది. దేశంలో అసలు ఏమి జరుగుతుందో అర్ధం కావటం లేదు. రోజుకి ఒక వ్యవస్థ సర్వ నాశనం అయిపోతుంది. కోర్ట్ లు, సిబిఐ, ఈడీ, ఆర్బీఐ, సీవీసీ ఇలా అన్నీ నాశనం అయిపోతున్నాయి. మొన్నటి మొన్న సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తులు, మీడియా ముందుకు వచ్చి ప్రధాన న్యాయమూర్తి వ్యవహార శైలి పై చేసిన విమర్శలు మరువక ముందే, ఇప్పుడు సిబిఐలో టాప్ బాస్లు ఒకరి పై ఒకరు విమర్శలు చేసి, అరెస్ట్ లు దాకా వెళ్లారు.
దేశంలోనే అవినీతి వ్యహరాలను దర్యాప్తు చేసే అత్యున్నత సంస్థ సీబీఐ అవినీతి ఆరోపణల్లో చిక్కుకోవడం, సీబీఐలో మొదటి రెండు స్థానాల్లో ఉన్న అధికారులిద్దరూ ఒకరిపై ఒకరు 'ముడుపులు' తీసుకున్నారంటూ అవినీతి ఆరోపణలకు దిగడంతో కేసులు నమోదు వరకూ పరిస్థితి వెళ్లింది. ఈ పరిస్థితికి కారణమైన కేంద్రం, ఏమి చెయ్యాలో తెలియక, సీబీఐ చీఫ్ అలోక్ వర్మ, స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్థానాలను సెలవు పై పంపింది. అయితే, తనను సెలవుపై పంపడంపై అలోక్ వర్మ సుప్రీంను ఆశ్రయించారు. అలోక్ వర్మ పిటిషన్‌ను పరిశీలించిన సుప్రీం కోర్టు.. సీబీఐ డైరెక్టర్ అధికారాలను లాగేసుకునే హక్కు ఎవరికీ లేదని, వర్మను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది.