ప్రతిపక్ష పార్టీలు కోరినట్లు 50 శాతం వీవీప్యాట్ స్లిప్పులను లెక్కిస్తే ఫలితాల వెల్లడికి ఆరు రోజులు సమయం పడుతుందని కేంద్ర ఎన్నికల సంఘం కోర్టుకు తెలియజేసిన విషయం తెలిసిందే. ఈసీ సమాధానంపై తమ అభిప్రాయం తెలియజేస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు సోమవారం పిటిషన్‌దారులను ఆదేశించింది. దీనికిగానూ వారం రోజుల గడువు విధించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు విచారణ చేపట్టింది. 50శాతం మేర ఓటు రసీదు యంత్రాలను(వీవీప్యాట్‌లను) లెక్కించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ప్రతిపక్షాల పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం అసెంబ్లీ నియోజకవర్గంలోని ఒక ఈవీఎంను మాత్రమే వీవీప్యాట్ స్లిప్పులతో సరిచూస్తున్నారు. ఈ నేపథ్యంలో విపక్ష పార్టీలు చేస్తున్న డిమాండ్ సరికాదని..కేంద్ర ఎన్నికల సంఘం అభిప్రాయపడింది. 50 శాతం వీవీప్యాట్లను లెక్కిస్తే, లోక్‌సభ ఎన్నికల ఫలితాలను ఆరు రోజులు ఆలస్యంగా వెల్లడించాల్సి వస్తుందని ఈసీ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. దీంతో పిటిషన్‌దారులైన 21 ప్రతిపక్ష పార్టీలు.. ఈసీ వివరణపై అభిప్రాయం తెలియజేస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీం కోర్టు కోరింది.
ఈవీఎంలపై పలు వర్గాల నుంచి అనుమానాలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల్లో తప్పనిసరిగా 50శాతం మేర వీవీప్యాట్‌లను లెక్కించి, వాటిని ఈవీఎంలలో నమోదైన ఓట్లతో సరిపోల్చాలని 21 రాజకీయ పార్టీలు గత నెలలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరాయి. అందుకు సంబంధించి నిబంధనలు రూపొందించాలని విన్నవించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌పవార్, రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్షనేత గులాంనబీ ఆజాద్‌తో పాటు మొత్తం 21 పార్టీల నేతలు ఫిబ్రవరి 4న కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సునీల్ అరోడాను కలిసి వినతిపత్రం అందజేశారు. అయితే ఈసీ నుంచి సంతృప్తికర సమాధానం రాకపోవడంతో వారంతా సుప్రీంకోర్టును ఆశ్రయించారు.